Wednesday, January 22, 2025

దేశానికే రోల్‌మోడల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశీ సంస్థలకు ధరణిని బిఆర్‌ఎస్ తాకట్టు పెట్టిందని, దానిని నెల కిందటే విడిపించామని, దేశానికే రోల్ మోడల్‌గా ఉండే కొత్త ఆర్‌ఓఆర్ చట్టం తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ కొత్త చట్టంపై అసెంబ్లీలో అన్ని వివరాలు వెల్లడిస్తామ ని, ప్రతిపక్ష నేతలు సలహాలు కూడా కొత్త చట్టంలో తీసుకుంటామని మంత్రి తె లిపారు. గాంధీ భవన్‌లో బుధవారం నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి పొంగులేటికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ధరణిని అడ్డం పెట్టుకొని గత పాలకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ధరణి సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని, అనేక ప్రభుత్వ స్థలాలను గత పాలకులు ఆక్రమించుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తిరిగి రికవరీ చేసి పేదలకు అందజేస్తామన్నారు. ధరణి అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని ఆయన తెలిపారు.

దాడి వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదు…
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారి ఆగడాలు ఏమాత్రం సాగవని మంత్రి హెచ్చరించారు. అధికారులపై జరిగిన దాడిపై కాస్త ఓపిక పడితే ఒక్కొక్కటిగా అన్ని విషయాలూ బయటకు వస్తాయని మంత్రి తెలిపారు. దాడి వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టప్రకారం శిక్షిస్తామని, ప్రతిపక్షం మాదిరిగా తొందర పడాల్సిన అవసరం తమకు లేదని ఆయన చెప్పారు.

జైల్లో పెట్టి ధర్నాలు చేస్తారా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతిపక్షాలు ధర్నాలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలను జైళ్లలో పెట్టినవారు ఇప్పుడు వారి వద్దకే వెళ్లి మద్దతు ఇస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో రైతన్నలను జైళ్లలో పెట్టి ఇప్పుడు ధర్నాలు, నిరాహార దీక్షలు, పోరాటాలు అంటూ వారిని మోసం చేస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. ధరణి చట్టంతో అనేక ఇబ్బందులు పడ్డామని రైతులు, భూ యజమానులు చెప్పిన విషయం గుర్తు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇందిరమ్మ రాజ్యమని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించామని మంత్రి పొంగులేటి తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఆశ పెట్టి గత పదేళ్లపాటు ఎన్నికల్లో గెలిచింది. కానీ, ఇంతవరకు వాటిని కట్టించలేదని మంత్రి ఆరోపించారు.

ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తాం..
పేదలకు 24 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని తాము చెప్పామని, గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. లబ్ధిదారులు నాలుగు వందల చదరపు అడుగుల ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుందని, మొదటి విడతలో స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇస్తుందని, విడతల వారీగా రూ.5 లక్షలను ఇంటి నిర్మాణానికి ఇస్తామని, ఇంటిని మహిళా యజమాని పేరిట ఇవ్వాలన్నది కాంగ్రెస్ లక్ష్యమని ఆయన తెలిపారు. త్వరలో ఉద్యోగాల నియామకాలకు ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

రుణమాఫీ పక్కా..
రైతు రుణమాఫీ కింద రూ.2 లక్షల చొప్పున ఇంకా కొంత మంది రైతులకు అందించాల్సి ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో తొండి ఆట ఆడమన్నారు. మిగిలిన అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. కేవలం 27 రోజుల్లో రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని, ఇంకా 13 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుగు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో పండిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో సుమారుగా 300 దరఖాస్తులను మంత్రి స్వీకరించడంతో పాటు అప్పటికప్పుడు కొన్ని దరఖాస్తులకు మోక్షం కలిగించారు. ప్రధానంగా భూములు, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాలు, పింఛన్‌ల కోసం దరఖాస్తులు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News