Tuesday, January 21, 2025

ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్

- Advertisement -
- Advertisement -

పోర్టల్ ముసుగులో లక్షల కోట్ల విలువైన
భూములు మాయం ముగ్గురు, నలుగురి
పేర్లమీద అక్రమ రిజిస్ట్రేషన్లు నిరుపేదల
ఆస్తులనూ కొల్లగొట్టారు సభలో గూండాల్లా
వ్యవహరిస్తున్న బిఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీలో
మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

తెలంగాణ కు కేసీఆర్ కాపలా కుక్కలా లేరని, రాష్టాన్ని దోచుకునే వేట కుక్కలా వ్యవహరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూ భారతి బిల్లు చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ చేసిన అక్రమాలను కప్పపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెప్పి ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సభా సాంప్రదాయాలను మరిచి బీఆర్‌ఎస్ సభ్యులు రౌడీలు, గుండాల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దళిత స్పీకర్ పై పుస్తకాలు విసిరారని, తనపై కూడా దాడి చేసేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ కాపలా కుక్కలా లేరని, రాష్ట్రాన్ని దోచుకునే వేట కుక్కలా వ్యవహరించారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ‘ధరణి’ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని, నిజాలను నిగ్గు తేలుస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ చిల్లర వేషాలను ప్రజలు హర్షించరు : గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా బీఆర్‌ఎస్ సభ్యులు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శాసనసభలో భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఫార్ములా ఈ-రేసు అంశంపై చర్చకు బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టడంతో పాటు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి ఆందోళనల మధ్యే భూ భారతి బిల్లుపై పొంగులేటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. బీఆర్‌ఎస్ సభ్యులు భూ భారతి బిల్లును ఆమోదించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి తీరు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంది. సభలో గూండాగిరి, దౌర్జన్యం, రౌడీయిజం లేకుండా స్పీకర్ చర్యలు చేపట్టాలని కోరారు.

బీఆర్‌ఎస్ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ తప్పులతడకగా ఉందని కేసీఆర్‌కు తెలుసు. ఆయన 80వేల పుస్తకాలు చదివారు. పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి ధరణి పోర్టల్ రూపొందించారని అనుకునేవాళ్లం. ఆ చట్టానికి మూడేళ్లకే వందేళ్లు నిండాయి. ఇందిరమ్మ రాజ్యంలో 1971లో చేసిన చట్టం 49 ఏళ్లుగా ప్రజల్లో ఉంది. భూ భారతి బిల్లుకు సంబంధించి భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అనేక సూచనలు ఇచ్చారు. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సూచనలు చేస్తారని ఆశించాం. అవి చట్టంలో పొందుపరచాలని భావించాం. కేసీఆర్ రాలేదు..సభలో ఉన్నవాళ్లు ఈరకంగా గొడవ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ చిల్లర వేషాలను ప్రజలు హర్షించరని పొంగులేటి వ్యాఖ్యానించారు.

‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ప్రభుత్వం ఆదేశం : సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన

‘ధరణి’ పై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రకటించారు. అసెంబ్లీలో భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ధరణి’ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1.50 వేల కోట్ల విలువ చేసే భూములు చేతులు మారాయని ఆరోపించారు. లిటిగేషన్‌లో ఉన్న ఆ భూములను సక్రమం చేసుకున్నారని తెలిపారు. దోచిన భూములను బీఆర్‌ఎస్ నేతలు తమ అస్మదీయులకు విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. కొన్నిచోట్ల భూములకు యజమానులు ఇక్కడ లేరని, పాకిస్తాన్ వెళ్లిపోయారని,

అధికారులు నో అబ్జెక్షన్ చెప్పారంటూ ఆ భూములను కూడా కాజేశారని పేర్కొన్నారు. ధరణి వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూమి ముగ్గురు, నలుగురు వ్యక్తులు మీద మాత్రమే బదలాయింపు అయిందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు చేసిన అక్రమాలను నిగ్గు తేలుస్తామని ధ్వజమెత్తారు. ధరణి పేరుతో నిరుపేదల ఆస్తులను కూడా కొల్లగొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కనిపించరని, సభకు రారని సైటెర్లు వేశారు. రోజుకొక వేషంతో బీఆర్‌ఎస్ సభ్యులు డ్రామాలు ఆడుతున్నారంటూ మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News