తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల సర్కార్ అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. సుజాతనగర్ మండలం, వేపలగడ నుంచి బృందావనం వరకు ఆర్‌అండ్‌బి నిధులు రూ.2 కోట్ల వ్యయంతో మూడు కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఎంపి రామసహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎంఎల్‌ఎల కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్దిలో వెనుకబడి ఉందని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నిలుపుతామని అన్నారు.
అనంతరం కొత్తగూడెం శ్రీ రామచంద్ర కళాశాలలో సావిత్రిబాయి ఫూలే జన్మదినం సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం జనవరి మూడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా రూ.657 కోట్ల వ్యయంతో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించామన్నారు. జిల్లాలోని రామవరం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం కృషి చేస్తానని, అందుకోసం కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతంలోని సింగరేణి, అటవీ, ప్రైవేట్ భూములను ఏర్పాటు చేసుకొని రాబోవు ఆరు నెలల్లో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగూడెంలో ఇండోర్ స్పోర్ట్ స్టేడియం కోసం కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం హాస్టళ్లలో చదువుకున్న పేద విద్యార్థులకు కనీసం భోజనం పెట్టలేని పరిస్థితి.. నేడు ఇందిరమ్మ రాజ్యంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు.
జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక చొరవ
జిల్లాలో విస్తృతంగా పర్యాటక రంగం అభివృద్ధ్ది చేయాలనే ప్రత్యేక ఆలోచనలతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చొరవతో ఈ ఏరు పండగను రూపొందించామని అన్నారు. ఈ పండుగను ఈనెల 9న వైకుంఠ ఏకాదవి శుభదినం సందర్భంగా, ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం సందర్భంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏరు అనేది ఈ జిల్లాలో మాట్లాడే గిరిజన భాషలో నీరు అని అర్ధం. ఈ పేరు గోదావరి నది, ఘాట్ల చుట్టూ నివసించే వేడుకలను ప్రతిబింబించేందుకు ఎంపిక చేశారు. కలెక్టుర్ జితేష్ వి పాటిల్ ఆలోచనలో భాగంగా ఈ పండుగ భద్రాచలం ఆలయం, గోదావరి నది బోటింగ్,
కనకగిరి శిఖరం, గిరిజన గ్రామ అనుభవం, కిన్నెరసాని డ్యాం, జింకల పార్కు లాంటి పర్యాటక ప్రదేశాలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం పాల్వంచ మండలం, రెడ్డిగూడెంలో రూ.1.70 కోట్లతో హైలెవల్ బ్రిడ్జికి మంత్రి శంకుస్థాపన చేశారు. పాల్వంచ బైపాస్ రోడ్డు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి సీతారాంపట్నం నుంచి పాండురంగాపురం గ్రామం వరకు రూ.10 కోట్ల వ్యయంతో పాండురంగాపురం బ్రిడ్జి వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఐటిడిఎ పిఒ రాహుల్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.