బస్ స్టేషన్స్‌లో ప్రయాణికులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. బుధవారం సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్, సికిందరాబాద్ లాలాపేట్ లోని బిసి గురుకుల పాఠశాలల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జూబ్లీ బస్టేషన్ లోని ప్రయాణికులతో మంత్రి ముచ్చటించారు. జెబిఎస్ శానిటేషన్ సిబ్బందితో మంత్రి మాట్లాడారు. బస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బస్టాండ్ లోని షాపులను పరిశీలించి, నాణ్యమైన ఆహర పదార్థాలను ఉంచాలని, కాలం చెల్లిన ఆహార వస్తువులు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాల్స్ లో ఎక్కువ ధరలకు వస్తువులు అమ్మరాదని, ఎవరైనా అమ్మినట్టు ఫిర్యాదులు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తాగునీరు , ఫ్లాట్ ఫాంలను పరిశీలించారు. ఫ్లాట్ ఫాంలపై డిస్ ప్లే బోర్డులు కనిపించే విధంగా ఉండాలని అధికారులకు సూచించారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్ లతో మాట్లాడి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలన్నారు. క్యాంటీన్ లో ఆర్‌టిసి ఉద్యోగులతో మాట్లాడారు. క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. జూబ్లీ బస్‌స్టేషన్ లో ఉన్న కార్గో సెంటర్ ను మంత్రి పరిశీలించి, ఉద్యోగులకు పలు సలహాలు ఇచ్చారు. ప్రతి రోజు ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కార్గో పార్సిల్స్, ఇతర వివరాలను ఉద్యోగులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, ఇతర అధికారులు ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
సికింద్రాబాద్ లాలాపేట లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీచేశారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచిందని విద్యార్థులకు అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు దగ్గర పడుతున్నా నేపథ్యంలో అందరూ బాగా చదువుకోవాలని సూచించారు. నవంబర్ 1 నుండి అమలు చేస్తున్న కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహరం అందించాలని ఆదేశించారు. జనవరి 26 లోపు ఐరన్ ర్యాక్స్, బెడ్స్ అందిస్తామని మంత్రి చెప్పారు.
త్రాగునిటీ సరిగా సరిపోవడంలేదని విద్యార్థులు మంత్రి దృష్టికి తెచ్చిన వెంటనే బోర్ ఏర్పాటు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను అందించాలని కోరారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చిందని, గుణాత్మకమైన విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అద్దె భవనాలలో ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల అద్దెలను 50 శాతం చెల్లించామని పిల్లల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వంట గది, డైనింగ్ హాల్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ మేయర్ శోభన్ రెడ్డి ల తో కలసి కూర్చొని వారి సమస్యలను విని అక్కడికక్కడే అధికారులకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ తిరుపతి, బిసి సంక్షేమ శాఖ అధికారులు నర్సింహులు, కృష్ణమాచారి, వార్డెన్ స్వర్ణలత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.