Monday, January 13, 2025

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి.. కెసిఆర్ కు పొన్నం ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం, ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్
 తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి 
రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఆహ్వానం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానపత్రం అందించిన మంత్రి పొన్నం

మన తెలంగాణ/హైదరాబాద్/మర్కుక్: ఈ నెల 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. విగ్రహావిష్కరణకు రావాలని పలువురు ప్రముఖులకు ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను కలిసి ఈ నెల 9న జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆహ్వనపత్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. అలాగే గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానించారు.

కేసీఆర్‌కు ఆహ్వానపత్రం అందజేసిన మంత్రి పొన్నం:

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఆయనతో సుమారు గంట 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజాపాలన వేడుకలకు రావాలని కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్ ఆహ్వానపత్రం అందజేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్ , ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం తరపున తాను, ప్రోటోకాల్ అధికారుం కలిశామని, తెలంగాణలో అందరినీ గౌరవించాలనేది మా పార్టీ తీసుకున్న నిర్ణయమని పొన్నం ప్రభాకర్ తెలిపారు. లంచ్ టైంలో వచ్చాము కనుక కేసీఆర్ లంచ్ చేయమంటే చేశామని, తమ భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. తాము అందరినీ ఆహ్వానిస్తున్నామని, కేసీఆర్ వస్తారా? రారా అన్న నిర్ణయం పార్టీలో చర్చించి తీసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి పొన్నం:

మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. రాజ్ భవన్ దిల్‌కుశా గెస్ట్‌హౌస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా రావాలని కిషన్‌రెడ్డికి మంత్రి పొన్నం ఆహ్వానపత్రికను అందచేశారు.

రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఆహ్వానం:

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని కలిసి ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ అధికారి వెంకట్ రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News