హైదరాబాద్: అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని బిఆర్‌ఎస్ కోరడంపై రవాణా శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చిన సందర్భంలో తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరితే ఛాన్స్ ఇచ్చారా?.. ఇప్పుడు వచ్చి తమకు అవకాశం కల్పించాలని ఎలా అడుగుతారని మంత్రి పొన్నం ప్రశ్నించారు.
మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు కెసిఆర్ ప్రజేంటేషన్ సందర్భంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి ఉంటే.. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుల్లో కుంగిపోయిన ఘటనలు ఉండేవి కాదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం చెప్పబోయేది గొప్పలు కాదనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించబోతున్నామన్నారు. ఇందులో రాజకీయం ఏమీ లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా బాగానే ఉంటే భుజాలెందుకు తడుముకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.
బిఆర్‌ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారని, ప్రభుత్వం మారిందని గ్రహించాలన్నారు. ఇన్నాళ్లు బిఆర్‌ఎస్ నాయకులు చెప్పినట్లుగా వారిది గొప్ప పరిపాలనే అయితే ప్రజావాణికి వేలాది దరఖాస్తులు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని, 15 రోజుల్లో సమీక్ష చేస్తామని మంత్రి పొన్నం హామీనిచ్చారు. ఆరు గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.