మల్లన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుంచి పంపు చేసినవే తప్ప అందులో కాళేశ్వరం నీళ్లు లేవని బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నిపుణుల సూచన మేరకు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం గేట్లు తెరిచే ఉంచామని అందువల్ల అక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసే అవకాశం లేదన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం కొట్టుకుపోతే ఈ నీళ్లెక్కడివి అంటూ బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీశ్ రావు శుక్రవారం మల్లన్నసాగర్‌ను సందర్శించి సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. మల్లన్న సాగర్‌లో ఉన్న నీళ్లకు కాళేశ్వరంకు ఏం సంబంధం అని మంత్రి ప్రశ్నించారు. ప్రతిపక్షం గుడ్డిగా మాట్లాడుతుందని ఆయన మండిపడ్డారు. వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నం అన్నారు.
కాళేశ్వరం పేరుతో కట్టిన ప్రాజెక్టు నిష్ప్రయోజనం అయ్యిందని, ఒక్క చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు బిఆర్‌ఎస్ నేతలు మల్లన్న సాగర్ వద్ద షో చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇకనైనా బిఆర్‌ఎస్ నేతలు కాళేశ్వరం విషయంలో ఇటువంటి పనులు మానుకొని తప్పు అంగీకరించాలన్నారు. కాళేశ్వరం విషయంలో రాజకీయాల కంటే రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధితోనే కాంగ్రెస్ పనిచేస్తుందని, అందువల్లే ఎల్లంపల్లి నుంచి దాని కింద ఉన్న మిగతా జలాశయాలను నింపుకోగలిగామన్నారు. తమ ప్రభుత్వంపై భగవంతుడి కటాక్షం కూడా ఉందన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావు తన అనుభవాన్ని చెబితే చెప్పాలి తప్ప రాజకీయం చేయవద్దని మంత్రి పొన్నం కోరారు.