Wednesday, February 19, 2025

కులగణన సర్వేకు చట్టబద్ధత కల్పిస్తాం:మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

కులగణన సర్వేకు చట్టబద్ధత కల్పిస్తామని, కేబినెట్ తీర్మానంతోపాటు శాసనసభలో చట్టం తీసుకొస్తామని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బిజెపి నాయకులు వక్రీకరించడం తగదని అన్నారు. ప్రధానమంత్రి మోడీ కులానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చి తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేసే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. గత ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో భాగంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరికి ఎంతో వారికి అంత రావాలని అభిలషించారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా,

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన సర్వే చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తమ ప్రజా ప్రభుత్వం లక్ష మంది ఉద్యోగులతో 150 ఇండ్లకు ఒకరు చొప్పున కుల సర్వే నిర్వహించిందని తెలిపారు. తాము 100 శాతం సర్వే చేశామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. పూర్తికాని సర్వేలో భాగంగా 3.1 శాతానికి గాను 3 లక్షల 54 వేల ఇండ్లు మిగిలిపోయాయని, దీనిలో హైదరాబాద్ నగరంలోనే 2 లక్షల 50 వేల ఇండ్లు ఉన్నాయని అన్నారు. ఈనెల 16 నుండి 28వ తేదీ వరకు మరో అవకాశం కల్పిస్తున్నామని, వీలైతే హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి నాయకులు తెలంగాణ జనాభా లెక్కలలో ఉండాలని, ప్రజలను చైతన్యపరచి సర్వేలో పాల్గొనేలా చూడాలని హితవు పలికారు. సర్వేలో సమాచారం ఇవ్వకుండా, స్పందించకుండా ఏది పడితే అది మాట్లాడడం మంచిది కాదని మండిపడ్డారు. రాష్ట్ర జనాభా లెక్కలలో 56 శాతం బిసిలు ఉన్నా వారికి 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెలిపామని,

దానికి అనుగుణంగా కేబినెట్ తీర్మానం చేయబోతున్నామని వెల్లడించారు. కేబినెట్ తీర్మానంతోపాటు శాసనసభలో చట్టం తీసుకొస్తామని అన్నారు. రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలలో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా బిజెపి నేతలు తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్రం నుండి అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకునే క్రియాశీలకమైన పాత్ర పోషిస్తే బలహీన వర్గాలు మీ పట్ల ఆలోచిస్తాయని అన్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని. సామాజిక భారతదేశంలో వెనుకబడ్డ వారిని ముందుకు నడిపించాలి ముందున్నవారు వెనుకబడ్డ వారికి సహకారం అందివ్వాలన్నారు. ‘బిసిల కులగణన సర్వేలను వ్యతిరేకరించేది.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసేది.. ప్రధానమంత్రి పుట్టుకతో బిసి కాదు అంటే ఖండించేది మీరే’ అని మండిపడ్డారు. సర్వే తప్పులతడక అంటూ మతపరమైన అంశాలు జోడించి అడ్డుపడతారని విమర్శించారు. కేంద్రంలో అధికారం ఉన్న మీ నాయకులను ఒప్పించి దేశవ్యాప్తంగా సర్వే చేయాలని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు.. మిగతావారువారు ఎంతమంది ఉన్నారు.. వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News