Thursday, December 19, 2024

వరదలు అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలి…

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం వరదలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గోదావరి వరదల సందర్భంగా భద్రాచలం వద్ద గోదావరి బ్రిడ్జి, చెరువు కట్ట పై నుండి వరద ఉదృతిని మంత్రి పువ్వాడ పర్యవేక్షించారు.

అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నందు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, జిల్లా ఎస్పీ వినీత్, వరదల ప్రత్యేక అధికారి అనుదీప్, ITDA PO ప్రతీక్ జైన్, ASP పారితోష్ పంకజ్, లైబ్రరీ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ లతో సమీక్ష నిర్వహించారు. రానున్న 48 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో అనేక ప్రాంతాలలో రహదారులపై లో-లెవెల్ బ్రిడ్జి లపై వరద నీరు ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారాయని, కావున ప్రమాద పరిస్థితులను ప్రజలకు వివరించి అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పాల్వంచ-భద్రాచలం నాగారం కిన్నెరసాని బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని అక్కడ నిత్యం పోలీస్ సిబ్బందికి నియమించి, మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప రాకపోకలు నియంత్రించాలని జిల్లా ఎస్పి వినీత్ కు సూచించారు.

ప్రజలు ప్రభుత్వంకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. మరో 48 గంటల పాటు అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించిన నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో మంచి వసతులు, సౌకర్యాలు కల్పించాలని, వారికి అవసరం అయ్యే అన్ని సమకూర్చాలని కోరారు. ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని, ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అలాగే నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలని సూచించారు.

జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్న వారికి సేవలందించాలని పేర్కొన్నారు. అత్యవసర సేవలకు తప్పనిసరిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని, జిల్లాలోని పరిశ్రమల ఆధ్వర్యంలో ఉన్న రెస్క్యూ టీములను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, అస్తి నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News