Saturday, December 28, 2024

భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలను వీక్షించడానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రానున్న ఉత్సవాల ఏర్పాట్ల పై అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మొదటగా జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్సవాలకు చేపడుతున్న పనులు, అధికారులకు కేటాయించిన విధులపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా, గోదావరి వరదలు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి పర్యటన,ముక్కోటి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డా. వినీత్‌ల ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ప్రజల మన్ననలు పొందారని, అదేసూర్తితో ఈ మహోత్సవాలను కూడా ద్విగ్విజయంగా నిర్వహించాలని సూచించారు.

భద్రాచలం వచ్చే భక్తుల కోసం 24 గంటలు పనిచేసే విధంగా అత్యవసర వైద్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎమర్జన్సీలో వైద్యసేవల కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐసియు వార్డులను సిద్దంగా ఉంచాలన్నారు. పారిశుథ్య కార్యక్రమాల నిర్వహణకు పట్టణాన్ని 15 జోన్లుగా విభజించి ప్రతి జోన్‌కు యంపివో, నలుగురు కార్యదర్శులు పర్యవేక్షణ చేసేలా చర్యలు చేపట్టాలని డిపిఓను ఆదేశించారు. 450 మంది పారిశుథ్య కార్మికులు పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. భక్తులు కల్యాణం వీక్షించడానికి వీలుగా 36 ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వామివారి కల్యాణ తలంబ్రాల కోసం 70 కౌంటర్లు, ప్రసాదాలకు 19 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హోటళ్లలో ఆహార పదార్థాలు ఎక్కువ ధరలకు విక్రయించకుండా, నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిఎస్‌ఓను ఆదేశించారు. భక్తుల కోసం ఆన్‌లైన్‌లో స్వామివారి కల్యాణం, పట్టాభిషేకాల టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. నేరుగా టిక్కెట్లు కొనుగోలు చేసుకునేందుకు భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాలతో పాటు దేవస్థానంలో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రైళ్లు, బస్సుల సమాచారం, జిల్లాలోని దర్శనీయ స్థలాలు, మహోత్సవాల సమాచారం కోసం 25 సమాచార కేంద్రాల్లో ఫ్లెక్సీలు, కరపత్రాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రతి సెక్టార్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం అదనంగా 180 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ భక్తునికి స్వామివారి తలంబ్రాలు అందించాలనే లక్షంతో 200 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం, పర్ణశాలలో భక్తులు గోదావరి లోపలికి వెళ్లకుండా డేంజర్ బోర్డులు ఏర్పాటు చేసి, నాటు పడవలు, గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచాలన్నారు. అలాగే ఉత్సవాల కోసం 400 బస్సులు ఉన్నాయని, భద్రాచలం నుండి పర్ణశాల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు.

విద్యుత్ అంతరాయం రాకుండా అదనపు ఫీడర్లు ద్వారా విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు జనరేటర్లు సిద్దంగా ఉంచాలని విద్యుత్ అధికారులకు సూచించారు. 29 నుండి 31 వరకు మద్యం, మాంసం విక్రయాలు నిలిపివేయాలని ఎక్సైజ్ అధికారులకు చెప్పారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు వస్తున్నందున హెలిఫ్యాడ్‌లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా దేవాలయం చుట్టూ అగ్నిమాపక వాహనాలను సిద్దంగా ఉంచడంతో పాటు సెక్టార్లలో ఫైర్ ఎస్టింగ్విష్ పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య. గ్రంధాలయం సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఎస్పీ డా. వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీవో రత్నకల్యాణి, ఎఎస్పీ పారితోష్‌పంకజ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News