Monday, December 23, 2024

థరూర్‌కు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లీగల్ నోటీస్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌కు లీగల్ నోటీస్ పంపారు. ఇటీవల ఒక టివి చానెల్‌లో తన పరువుకు నష్టం కలిగించే ప్రకటనలను థరూర్ చేశారని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ నెల 26న జరగనున్న ఎన్నికల్లో తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో శశి థరూర్‌పై చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. కీలక వోటర్లు, పారిష్ పూజారులు వంటి ప్రభావశీల వ్యక్తులకు లంచం ఇస్తున్నారని తనపై ‘పూర్తిగా తప్పుడు సమాచారాన్ని’ కాంగ్రెస్ ఎంపి ఇచ్చారని చంద్రశేఖర్ ఆరోపించారు. చంద్రశేఖర్ పరువు ప్రతిష్ఠలకు హాని కలిగించే ఉద్దేశంతో శశి ధరూర్ ప్రకటనలు చేశారని, ఆయన వ్యాఖ్యలు తిరువనంతపురం క్రైస్తవ సమాజాన్ని, వారి నాయకులు వోట్లకు నగదు కార్యకలాపాలకు పాల్పడడం ద్వారా వారిని అవమానించారని నోటీస్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపి ప్రకటనలు ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసిసి)కి విరుద్దమైనవని కూడా నోటీస్‌లో పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత ఎన్నికల ప్రచారాన్ని దెబ్బ తీయడం, థరూర్‌కు ప్రయోజనం చేకూర్చడం ఆ ప్రకటనల లక్షం అని కూడా నోటీస్‌లో ఆరోపించారు. ఈ నెల 6న చంద్రశేఖర్‌పై చేసిన ఆరోపణలు అన్నిటినీ‘తక్షణం ఉపసంహరించాల’ని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయనకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో మంత్రి ‘ప్రతిష్ఠకు హాని కలిగించరాద’ని థరూర్‌కు పంపిన లీగల్ నోటీస్‌లో కోరారు. నోటీస్ అందిన 24 గంటల్లోగా సదరు షరతులను పాటించకపోతే సమర్థమైన న్యాయస్థానంలో సముచిత క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోగలమని నోటీస్‌లో హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News