Sunday, January 19, 2025

దేశ భద్రతలో రాజకీయాలు తగదు

- Advertisement -
- Advertisement -

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా, దామగుండం అటవీ ప్రాంతంలో విఎల్‌ఎఫ్ రా డార్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరని, పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అంతా కలిసి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో నేవీది కీలకపాత్ర అని, ఇండో పసిఫిక్ రీజియన్‌లో రాడార్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందని అన్నారు. దేశానికి ఉపయోగమైన ప్రాజెక్ట్ ఇక్కడ ప్రారంభమవుతోందన్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం జయంతి రోజున తెలంగాణలో ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్నారని అంటూ సిఎం సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, భద్రతలో రాడార్ కీలకమని పేర్కొన్నారు. మొదటినుంచి తెలంగాణ ప్రజలు కష్టజీవులని అన్నారు. రక్ష ణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉందని, దేశాభివృద్ధిలో తెలంగాణ ప్రధానంగా మారిందన్నారు. కమ్యూనికేషన్ విషయంలో రాడార్ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుందని, పదేళ్లలో దేశ భద్రత మెరుగైందని అన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో సవాళ్లు పెరిగాయని అన్నారు. త్రివిధ దళాల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఈ నేపథ్యంలో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సముద్ర ఖనిజ సంపదలపై అన్ని దేశాలు దృష్టి పెట్టాయని, సముద్రాలపై ఆధిపత్యం ప్రదర్శిస్తేనే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థల్లో వచ్చిన మార్పుల వల్లే కోవిడ్ సమయంలో సవాళ్లను అధిగమించగలిగామని అభిప్రాయపడ్డారు. మలక్కా నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వరకు మన నౌకాదళం ఎంతో బలంగా విస్తరించి ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న రాడార్ వ్యవస్థ మన నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

రాడార్ వ్యవస్థతో కీలక అడుగువేయనున్న తెలంగాణ: సిఎం రేవంత్‌రెడ్డి
సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కీలక అడుగు వేయబోతుందని అన్నారు. హైదరాబాద్ ముందు నుంచి రక్షణ రంగానికి అవసరమైన రకరకాల ఆయుధాలను తయారు చేస్తోందన్నారు. దేశానికి సంబంధించిన క్షిపణులు తయారుచేసే లొకేషన్ కింద హైదరాబాద్ గుర్తింపు పొందిందని అన్నారు. దేశానికి మూడువైపుల సముద్ర ప్రాంతం ఉందని, బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రాలు ఉన్నాయని, సముద్రంలో ప్రయాణించే షిప్‌లను మానిటరింగ్ చేయడానికి ఈ విఎల్‌ఎఫ్ స్టేషన్‌ను దామగుండంలో ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ అంశాన్ని వివాదం చేయాలని, ఇక్కడ విఎల్‌ఎఫ్ నిర్మిస్తే జిల్లాకు అన్యాయం జరుగుతుందని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో రాడార్ ఏర్పాటు చేయడం వల్ల ప్రకృతికి, మనుషులకు ఎటువంటి నష్టం జరగలేదని అన్నారు. దేశంలోనే రెండవ విఎల్‌ఎఫ్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడంతో ఈ ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు.

విఎల్‌ఎఫ్ వివాదానికి తెరలేపుతున్నవారు దేశ రక్షణ కోసం కృషి చేయాలన్నారు. దేశ రక్షణ కోసం చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయం చేసే వారికి కనువిప్పు కలగాలన్నారు. ఫారెస్ట్‌ను అభివృద్ది చేయడానికి తెలంగాణకు ఇవ్వడానికి గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయాలు జరిగాయని, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో రాజీపడొద్దనే ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించామని అన్నారు. తాను పర్యావరణ ప్రేమికులకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నానని, దేశ భద్రతకు ముప్పు నుంచి కాపాడేందుకు చేస్తున్న ప్రాజెక్ట్‌ను వివాదం చేయడం సరికాదని హితవు పలికారు. వికారాబాద్ జిల్లా నుంచి తాను ఎంఎల్‌గా, ఇక్కడి వ్యక్తే అసెంబ్లీ స్పీకర్ అయ్యారని, దేశం కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు. తామంతా దేశ సంరక్షణ కోసం పనిచేస్తున్నామని, అడ్డుకునేందుకు చూస్తే ఇక్కడ దామగుండం శివుడే వారికి తెలివి కల్పిస్తాడని పరోక్షంగా బిఆర్‌ఎస్ నేతలకు చురకలంటించారు. దేశ రక్షణ కోసం రాజనీతితో ఆలోచించి పనిచేస్తున్నామని, దేశ రక్షణ కోసం ఏకమై పని చేస్తామన్నారు. పార్టీలు వేరైనా అందరం కలిస్తే దేశాన్ని కాపాడుతామన్నారు.

ఇది సురక్షితమైన ప్రాజెక్టు అని, లక్షల చెట్లు తీసేస్తారని అబద్ధాలు చెబుతున్నారని, తాము నిలబడి పనిచేస్తామని, విఎల్‌ఎఫ్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, దీనిని పూర్తిచేసేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని అన్నారు. ఇక్కడ భక్తులు నమ్మే దేవాలయం ఉందని, వారు వచ్చి పోయేందుకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని అన్నారు. ఇక్కడ పిల్లలు చదువుకునేందుకు స్థలం ఇవ్వాలని, పాఠశాలలో ఒకటి బై మూడవ వంతు సీట్లు ఇవ్వాలని రక్షణ మంత్రిని కోరారు. ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కొండా సురేఖ, మహబూబ్‌నగర్ ఎంపి డికె అరుణ, నేవీ ఉన్నతాధికారులు, ఎంఎల్‌ఎలు రామ్మోహన్ రెడ్డి, కాలె యాదయ్య, మనోహర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్‌పి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News