గాంధీనగర్ : కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈమేరకు సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్సులో రిటర్నింగ్ ఆఫీసర్ రీటా మెహతాకు ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్, గుజరాత్ బిజేపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ఉన్నారు. నాలుగేళ్ల క్రితం జైశంకర్ మొదటిసారి గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు మొత్తం 11 స్థానాలు ఉండగా, ప్రస్తుతం 8 మంది బీజేపీ ఎంపీలు, మిగతా వారు కాంగ్రెస్ ఎంపీలు.
ఈ ఎనిమిది స్థానాలకు సంబంధించి ఎస్. జైశంకర్, జుగల్‌జీ ఠాకోర్, దినేష్ అనవాడియా పదవీకాలం ఆగస్టు 18 తో పూర్తి అవుతుంది. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ స్థానాలు మూడు ఉండగా, 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమకు తగినంతమంది ఎంఎల్‌ఎలు లేనందున ఈసారి తాము అభ్యర్థులను పోటీకి దింపడం లేదని కాంగ్రెస్ గత శుక్రవారం ప్రకటించింది. గత ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి రికార్డుస్థాయిలో 156 స్థానాలను కైవశం చేసుకోగలిగింది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.