Wednesday, January 22, 2025

హామీ ఇచ్చి విస్మరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: గత ఎన్నికల్లో తాను మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే మీర్‌పేట్ కార్పొరేషన్‌లో ప్రజల నడ్డివిరుస్తున్న ఇంటిపన్నులను తగ్గిస్తానంటూ హామీ ఇచ్చి,విస్మరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి తన వ్యక్తిగత స్వార్ధం కోసం ప్రజలను మభ్యపెట్టి రాజకీయపబ్బం గడుపుకుంటుందని డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి నిప్పులు చెరిగారు.మీర్‌పేట్ కార్పొరేషన్‌లో జిహెచ్‌ఎంసి కన్నా అధికంగా ఉన్న ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్‌చేస్తూ చల్లా ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు జిల్లెలగూడ లలితనగర్‌చౌరస్తా నుండి కార్పొరేషన్ కార్యాలయం వరకు బుధవారం ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికంగా ఉన్న పన్నుల బారం కారణంగా ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గతంలో మూడు పర్యాయాలు మంత్రి సబితకు విన్నవించగా ప్రజలపై పన్నుల భారాన్ని పడనివ్వనని హామీ ఇచ్చి,సబిత ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని విమర్శించారు.కాలనీల సంక్షేమ సంఘాలను పిలిపించుకొని మరీ పన్నులు తగ్గిస్తామని మాయమాటలు చెప్పి,మభ్యపెట్టిందని ఆరోపించారు.

అప్రజాస్వామిక విధానాలతో ప్రతిపక్ష్యాలు,ప్రజలు,ప్రశ్నించే గొంతుకలైన పత్రికల గొంతునొక్కుతున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రోజుల దగ్గరపడ్డాయని,నియోజకవర్గంలో మంత్రి సబిత అణుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై విసుగుచెందిన ఇక్కడి ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆమెకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు.అభివృద్ధి,సంక్షేమం రెండుకళ్లుగా భావించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై-ఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న సబిత అప్పట్లో వైఎస్ పాటపాడారని,అధికారం కోసం పార్టీమారి ఇప్పడు కెసిఆర్‌కు వంతపాడుతున్నారని మండిపడ్డారు.రానున్న 4 నెలల్లో రాష్ట్రంలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని,ప్రస్ధుతం అధికార బిఆర్‌ఎస్‌పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య,రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్‌పార్టీ పోరాడుతుంటే పొలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం భావ్యం కాదని అన్నారు.బిఆర్‌ఎస్,బిజెపిపార్టీలు రెండూ ఒకేగూటి పక్షులని,కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశం ప్రతి 90 రోజులకు జరగాల్సి ఉండగా 150 రోజులు గుడుస్తున్నా నిర్వహించకపోవడం శోచనీయమని అన్నారు.కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతుంటే బిజెపికి చెందిన కార్పొరేటర్లు 16 మంది ఉన్నప్పటికీ సమస్యలపై వారిలో ఏమాత్రం చలనం లేకపోవడం దురదృష్టకరం అని విమర్శించారు.అదేవిధంగా మంత్రి సబిత తక్షణం స్పందించి 4 రోజుల్లోగా ఇంటిపన్నులు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆమరణ నిరాహారదీక్ష చేపడుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జెడ్‌పి కాంగ్రెస్ మాజీ ఫ్లోర్‌లీడర్ ఏనుగుల జంగారెడ్డి,కార్పొరేటర్లు చల్లా కవితబాల్‌రెడ్డి,సిద్ధాల మౌణికశ్రీశైలంకురుమ, నాయకులు ఏడుదొడ్ల సురేందర్‌రెడ్డి, ఆవుల యాదయ్య,అహ్మద్‌బామ్,ఎరుకల వెంకటేశ్‌గౌడ్,నిమ్మల వెంకటేశ్‌గౌడ్,నవారు మల్లారెడ్డి,సోమ భూపాల్‌రెడ్డి,కె సురేష్‌శ్రీనివాస్,మాధవచారి,వెంకట్రామ్‌నాయక్,పద్మశ్రీ,అరుణదేవి, రవీందర్‌రెడ్డి,రామిడి శ్రీనివాస్‌రెడ్డి,కీసర యాదిరెడ్డి, గంగమ్మ, ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి,మురళిగౌడ్, గెల్ల సుభాష్‌రెడ్డి, ఐతరాజు భాస్కర్,పైళ్ల శేఖర్‌రెడ్డి,పరశురాం,దీక్షిత్,చింతకింది రంజిత్,గాజుల ఆనంద్,చంద్రమోహన్,కల్వకోల్ బాల్‌రాజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News