హైదరాబాద్: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ…
ఇది కిషన్ రెడ్డి మాటనా, కేంద్ర ప్రభుత్వం వైఖరా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు, తెలంగాణ గిరిజనుల హక్కు అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టం లో హామీ ఇచ్చిందన్నారు. ఎన్నో ఆందోళనల తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తామని హామీ వచ్చిందని తెలిపారు. 2006లో రక్షణ స్టీల్స్ కు బయ్యారం గనులు కేటాయిస్తే నిరసనలు వ్యక్తమైతే అప్పటి ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేసుకుందని మంత్రి వెల్లడించారు. కిషన్ రెడ్డి ప్రకటన తెలంగాణపై పిడుగు పాటు లాంటిదన్నారు. కిషన్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయన తెలంగాణలోనే పుట్టారా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ప్రతి అంశంలో అవగాహన లేకుండా మాట్లాడుతారని చెప్పారు. కేంద్ర మంత్రి అయ్యాక కిషన్ రెడ్డి తెలంగాణకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా? అని మంత్రి సత్యవతి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహంగా మారారు.. ఆయనకు కేంద్రమంత్రి పదవి అలంకార ప్రాయమేనా…
కిషన్ రెడ్డి తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు పై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పదవి తెలంగాణకు ఏమైనా అక్కరకు వచ్చిందా కిషన్ రెడ్డి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలన్నారు. బీజేపీ నేతలకు తమ సొంత పనులపై ఉన్న శ్రద్ధ తెలంగాణకు మేలు చేయడంలో లేదని ఆరోపించారు. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం పని చేస్తోంది.. కానీ తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం విషయంలో భూమి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెడుతోందన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కి అనువైన పరిస్థితులు ఉన్నాయని నిపుణుల కమిటీ గతం లోనే చెప్పిందన్నారు. 100 నుంచి 150 ఏండ్లకు సరిపడా ముడి ఉక్కు నిల్వలు బయ్యారంలో ఉన్నాయి. బీజేపీ తెలంగాణ పట్ల తన వైఖరి మార్చుకోకపోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని మంత్రి పేర్కొన్నారు. ప్రజల్లో తిరుగుబాటు రాక ముందే బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని సూచించారు. బీజేపీ నేతల తీరు మారక పోతే వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. బయ్యారం ఉక్కు నాణ్యతపై ఉమ్మడి సర్వేకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కిషన్ రెడ్డి తీరు మారక పోతే మేమే స్వయంగా ఉద్యమిస్తాం.. గిరిజనుల రిజర్వేషన్లకు కేంద్రం కుంటి సాకులతో మోకాలడ్డుతోందని మంత్రి ఆరోపించారు.