మహిళల రక్షణకు సిఎం అత్యధిక ప్రాధాన్యం
కార్యదర్శులు సదస్సులో మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ : మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి గా నిలిచిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోడానికి నిర్వహించిన సదస్సులో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒరిస్సా రాష్ట్రాల శిశు సంక్షేమ శాఖ కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బాలికలతో ప్రేమ నటించి, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికి, నిరుద్యోగం, భర్త నుండి విడిపోయిన మహిళలను లొంగతీసుకోవడం, ఒంటరి మహిళల నిరక్షరాస్యత, సినిమాల్లో చాన్స్, విలాసవంతమైన జీవితాల వైపు ఎరవేయడం లాంటి కారణాలు మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణాలని అన్నారు.
వీటిపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. డ్రగ్స్, ఆయుధాల సరఫరా తర్వాత మానవ అక్రమ రవాణా ఆందోళన కల్గిస్తోందన్నారు. ప్రభుత్వ సంస్థలు, పౌర సంఘాలు, స్వచ్చంద సేవా సంస్థలు ముందుకు వచ్చి అక్రమ రవాణా నిర్మూలనకు కృషి చేయాలని మంత్రి కోరారు. మానవ అక్రమ రవాణా అరికట్టడంలో బ్రాండ్ అంబాసిడర్లుగా యువత ముందుకు రావాలని సూచించారు. అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు 100, మహిళా హెల్ప్‌లైన్ 181, మహిళా కమిషన్ వాట్సప్ నెంబర్ లకు, చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేసి తెలుపాలన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ నవీన్ రావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లకా్ష్మరెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్, కమిషనర్ మహేష్ భగవత్, ఇతర రాష్ట్రాల శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.