Wednesday, January 22, 2025

గిరిజన గురుకుల విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య

- Advertisement -
- Advertisement -

Minister Satyavathi Rathod review on study circles

రాష్ట్రంలో మరిన్ని స్టడీ సర్కిళ్ళ ఏర్పాటుకు కార్యాచరణ
ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని స్టడీ సర్కిళ్ళ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. నూతన గిరిజన గురుకులాలు, స్టడీ సర్కిళ్ళ ఏర్పాటు పై బుధవారం సంక్షేమ భవన్‌లోని తన కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన గురుకులాల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో గురుకుల విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, భోజనం మరింత మెరుగు పరచాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలని ఆదేశించారు.

విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాం పుస్తకాలు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు, ఇతర సౌకర్యాలన్ని అందించేలా చూడాలన్నారు. పదవ తరగతి వరకు విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కావాల్సిన నైపుణ్యాల కోసం స్టడీ సెంటర్లలో శిక్షణ అందించేలా ప్రణాళికను రూపొందించాలని అధికారులను కోరారు. యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్ళు పోషించాలని, అందుకు సంబంధించి ప్రతి స్టడీ సర్కిల్‌లో ఫ్యాకల్టి ఏర్పాటు, కంప్యూటర్లను, ఆత్యధిక సాంకేతిక మౌలిక వస్తువులను సమకూర్చాలన్నారు. రాజేంద్రనగర్‌లోని ఐఐటి, జెఈఈ ఎంసెట్ కోచింగ్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, పరిగి, హాయాత్‌నగర్, వరంగల్‌లలో ఈ ఏడాది కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, విజయలక్ష్మి, లక్ష్మీప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News