Saturday, November 23, 2024

శ్రీవారి సన్నిధిలో మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ మరోసారి సిఎం కావాలని మొక్కుకున్నాని వెల్లడి

హైదరాబాద్ : తిరుమల శ్రీవారిని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఆదివారం విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులుతో కలిసి స్వామివారి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి గారికి అర్చకులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మంత్రి మాట్లాడారు. తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలని శ్రీవేంకటేశ్వరస్వామిని వేడుకున్నానని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు అత్యధికంగా పోడు భూములు అందించారన్నారు. గిరిజన బిడ్డలను భూ యజమానులు చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని మంత్రి చెప్పారు. గిరిజన అభ్యున్నతి కోసం 3,146 ఆదివాసి గూడాలు, తండాలను గ్రామ పంచాయతీలు చేయడం, ఆదివాసీ గూడేలు, తండాలకు 2 వేల కోట్లతో బిటి రోడ్లు, గిరి వికాసం, గిరిజన ఆవాసాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడం, దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజన గురు కులాలను ఏర్పాటు చేయడం, జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్‌లు 10 శాతానికి పెంచడం, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇలా ఎన్నింటినో అందించి కెసిఆర్ గిరిజన బాంధవుడుగా నిలిచారని మంత్రి కొనియాడారు. దేశంలోనే అతి చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని స్వామిని వేడుకున్నానన్నారు. ఆయన నాయకత్వంలొనే పేదలకు మేలు జరుగుతుందని, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని మంత్రి చెప్పారు. అవినీతి గురించి మాట్లాడే నరేంద్ర మోడీ దేశం పరువు ప్రతిష్టలు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బిజెపి అవినీతిని ప్రపంచానికి తెలియచెప్పిన నరేంద్ర మోడీకి కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత లేదని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది ఏండ్లలో తెలంగాణ అభివృద్ధికి బిజెపి ఒక్క పని కూడా చేయలేదని స్పష్టం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పి వ్యాగన్ వర్క్ షాప్ ను ఇచ్చారని, మోడి ఒక ప్రధానిలా కాకుండా గుజరాత్ మనిషిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణ, ఎపిలో బొగ్గు నిల్వలు ఉన్నా, ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయకుండా, ఆదాని, అంబానీలకు మేలు చేసే విధంగా మోడి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు ఆత్మగౌరవం తాకట్టు పెట్టే విధంగా ట్రైబల్ యూనివర్సిటి, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడని దుయ్యబట్టారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కీర్తి ఇప్పుడు ఢిల్లీకి తాకడంతో మోడికి భయం పట్టుకుందని పేర్కొన్నారు. అందుకే కెసిఆర్‌ను టార్గెట్ చేసి చౌకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడి పాలనలో అవినీతిని ఎండగడుతూ, ఎదురించి ప్రశ్నిస్తున్న నాయకుడు కెసిఆర్ మాత్రమేనని, ఎన్నికల ముందు వరంగల్‌కు వచ్చిన మోడి తెలంగాణాకు మొండి చేయి ఇచ్చి, అక్కసు వెళ్లగక్కి వెళ్ళారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మంత్రి సత్యవతి రాథోడ్ కుమారుడు సునీల్ రాథోడ్, పిఎస్ రవీందర్, అడిషనల్ ఎపి. ఎస్. శ్యామ్ సుందర మూర్తి , పిఎ ప్రణవ్, శివకుమార్ తదితరులు ఉన్నారు.

 

Satyavati Rathod

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News