Sunday, January 12, 2025

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపైనా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు వారి సొంత ఎజెండాను ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపైనా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ ప్రజల అస్థిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, శ్రమైక జీవన రూపం, తల్లి ఆశీర్వచనం ఉన్నాయని ఆమె తెలిపారు.

బిజెపి, బిఆర్‌ఎస్ వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని మాట్లాడుతున్నారని, పదేళ్ల కాలంలో అధికారికంగా తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నాయకులు గతంలో కెటిఆర్ సోదరికి దేవతా విగ్రహ రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుందో ఆ రకమైన విగ్రహాలు వారు పెట్టుకొని, దానిని తెలంగాణ తల్లిగా ప్రజలపై రుద్దారని ఆమె మండిపడ్డారు. ఈరోజు పెట్టుకునే విగ్రహం తెలంగాణ ఆడబిడ్డల అస్థిత్వం ఎలా ఉంటుందో ఆ రూపంలో ఏర్పాటు చేసుకుంటున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

తెలంగాణ బిడ్డలంటే మట్టి, ఎట్టి బిడ్డలు కాదు…
పదేళ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న ఆలోచన, జయజయహే తెలంగాణ పాటను రాష్ట్రీయ గీతంగా చేయాలన్న ఆలోచన కూడా బిఆర్‌ఎస్ నాయకులకు రాలేదని, ఈ రోజు తాము ఏర్పాటు చేసుకుంటుంటే అడ్డుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో టిజిగా పిలుచుకున్న తెలంగాణను బిఆర్‌ఎస్ వాళ్లు టిఎస్‌గా మారుస్తున్నప్పుడు అడ్డుకోని బిజెపి వాళ్లు ఈ రోజు రాజకీయం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక తెలంగాణ మా ఊపిరి అని, తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమితిగా మార్చుకుందని,

అంతేగాక జయజయహే తెలంగాణను వినడానికి కూడా ఇష్టపడలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకుంటున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ బిడ్డలు అంటే మట్టి బిడ్డలు, ఎట్టి బిడ్డలు కాదని, గట్టి బిడ్డలు అని చెబుతూ ఈ రోజు శ్రామిక రూపాన్ని తెలంగాణ తల్లిలో చూస్తున్నందుకు గర్వంగా ఉందని సీతక్క అన్నారు. కాంగ్రెస్ అంటేనే మహిళలను గౌరవించే ప్రభుత్వమని సీతక్క అన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టామని, నష్టాల్లో ఉన్న ఆర్టీసిని లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News