Thursday, January 23, 2025

కెటిఆర్ అక్కసులో అర్ధం లేదు: సీతక్క

- Advertisement -
- Advertisement -

మూసీ నది పునరుజ్జీవం పై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణల్లో పసలేదని, ఆయన అక్కసులో అర్థం లేదని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును మొదట్లో వ్యతిరేకించి కేటీఆర్..ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి తలొగ్గి తాము వ్యతిరేకం కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, పిల్లి మొగ్గలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. మూసీ డీపీఆర్ ఎప్పుడో సిద్దం చేసామని చెబుతున్న కేటీఆర్ పదేళ్లుగా అధికారంలో ఉండి మూసీ నీటిని కనీసం ఎందుకు శుద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. నిజంగా మూసీ ప్రక్షాళన పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అభూత కల్పనలకు, ఆకాశానికి నిచ్చెనలు వేయడంలో కేటీఆర్ దిట్ట అని పేర్కొన్నారు.

ఎలాంటి డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు గోదావరి గోదారి పాలు చేసిన బీఆర్‌ఎస్ నేతలకు డీపీఆర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని స్పష్టం చేశారు. తామే మూసీ ప్రక్షాళనను మొదలు పెట్టామని ఓ వైపు గొప్పగా చెబుతూనే మరో వైపు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు నాంపల్లి, ఖైరతాబాద్ మండలాలకే పరిమితమైన హైదరాబాద్ నగరాన్ని నలదిక్కులా విస్తరించి విశ్వ నగరంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదే అని తెలిపారు. వండిన కుండలాంటి హైదరాబాద్ ను వడ్డించుకు తిన్నది టిఆర్‌ఎస్ నేతలు కాదా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. రాజధాని హైదరాబాద్ నగరానికి పురుడు పోసిన మూసీని కాపాడుకోవడానికి తమ ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు. మూసీ కి పునరుజ్జీవం పోసే మహా యజ్ఞంలో ఎవరికీ అన్యాయం జరగదని వెల్లడించారు.

ముంబైలో జరిగిన సమావేశానికి హాజరైన సీతక్క : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసీసీ నియమించిన సీనియర్ పరిశీలకుల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముంబైలోని తిలక్ భవన్ లో జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వార్ రూమ్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ భగెల్, చన్నీ, పృధ్విరాజ్ చవాన్, మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ రమేష్ చన్నితల, మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు నానా పటోలె, ఎంపీ వర్షా గైక్వాడ్ తదితర సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News