బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం రోజున ఆయనను కాంగ్రెస్ కార్యకర్తగా పిలిచి అవమానించారని గుర్తు చేశారు. గతంలో మహిళా గవర్నర్, నిన్న ట్రైబల్ గవర్నర్, ఇప్పుడు స్పీకర్‌ను బిఆర్‌ఎస్ నేతలు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఆమె ప్రసంగిస్తూ జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉందని,
స్పీకర్ చైర్‌ను ఒక వ్యక్తి లాగా కాకుండా వ్యవస్థలాగా చూడాలని మంత్రి విపక్షాలకు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చాలా అవమానాలు ఎదుర్కొన్నామని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగు వర్గాలను అవమానించే విధంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏక వచనంతో స్పీకర్ ను అవమానించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక నిబంధనలు కొత్తగా తీసుకొచ్చారని, అప్పుడు విపక్షాలను పోడియం వద్దకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. దళిత వర్గాలకు చెందిన స్పీకర్‌ను టార్గెట్ చేయడం మంచిది కాదని మంత్రి సీతక్క హితవు పలికారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించి, జగదీష్ రెడ్డిపై చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.
బీఆర్‌ఎస్ అహంకారం ఇంకా తగ్గలేదు
బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, శాసనసభ్యుల అహంకారం ఇంకా తగ్గలేదని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీ లాబీలో గురువారం ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. దళిత స్పీకర్ పై గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత స్పీకర్ కాబట్టే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఏకవచనంతో సంభోధించారని తెలిపారు. అదే గతంలో గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు ఆయన కాళ్ళు మొక్కేవాళ్లని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులకు మహిళా గవర్నర్ అంటే గౌరవం లేదని, ఆదివాసీ రాష్ట్రపతి అంటే గౌరవం లేదని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. పదేళ్లు పాలించినా బిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించినా ఆ పార్టీ నాయకుల అహంకారం ఇంకా తగ్గడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.