బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్షరాల రూ.7 లక్షల కోట్ల అప్పులు చేస్తే వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్‌గా రూ.207 కోట్లు చెల్లించాల్సి వస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. అంటే ప్రతి నెల సగటున రూ.6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల కుప్పను కడగడానికే సరిపోతుందని పేర్కొన్నారు. కెటిఆర్ ట్వీట్‌కు మంత్రి సీతక్క బుధవారం ఘాటుగా స్పందించారు. తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరేనని, అప్పుల వారసత్వానికి ఆద్యులు కూడా మీరేనని అన్నారు. అప్పుల అప్పారావులాగా అందిన కాడల్లా అప్పులు చేసి, రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలని కెటిఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పులు చాలవన్నట్లు వేల కోట్ల బకాయిలను గత ప్రభుత్వంలో చెల్లించలేదని, చేసిన పనులకూ బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు.
రూ.5 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, సర్పంచ్‌లకు పెండింగ్ బకాయిలు, విద్యుత్ సంస్థలకు, ఆర్టీసీకి, గురుకుల భవనాల ఓనర్లకు అద్దె బకాయిలు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధుల పెండింగ్‌లో ఉంచి తమ ప్రభుత్వంపై పెనుభారం మోపింది మీరు కాదా..? అని కెటిఆర్‌కు చురకలు వేశారు. ఇలా ప్రతి శాఖలో వందల కోట్ల బకాయిలు పెట్టి ఇప్పుడు బుకాయిస్తే ఏలా? అని నిలదీశారు. మీ నిర్వాకంతో గాడి తప్పిన ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతూ, ఈ పది నెలల కాలంలో రూ.18 వేల కోట్ల పంట రుణాలను ప్రజా ప్రభుత్వం మాఫి చేసిందని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల వంటింటి భారం దించేందుకు రూ.500కే గ్యాస్ సిలిండర్, సామాన్యులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ప్రజా ప్రభుత్వం భర్తి చేసిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని వివరించారు. అయినా మీరు అప్పులు, బకాయిలు, హమీల గురించి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని కెటిఆర్‌పై ధ్వజమెత్తారు.