Monday, January 6, 2025

మహిళా సంఘాలకు రూ.50 కోట్ల వడ్డీ లేని రుణాలు:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా, వాణిజ్య పరంగా రాణించాలనే లక్షంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రూ.50 కోట్ల రుణాలు ఇచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మధురాపూర్‌లో షాద్‌నగర్ ఎంఎల్‌ఎ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన, కమ్యూనిటి హాల్, మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. నందిగామ మండల పరిధిలోని అప్పారెడ్డిగూడలో పంచాయతీ భవనానికి, ఫరూక్‌నగర్ నుండి వీర్లపల్లి మీదుగా చేగూరు వరకు రూ.19.4 కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ..గత ఎన్నికల్లో అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు మూడు దశల్లో రూ.21వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని వివరించారు.

మహిళలు వంటింటికే పరిమితం కాకుండా వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలనే సంకల్పంతోనే పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మహిళలు ఐక్యంగా దినదిన అభివృద్ధి సాధించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సావిత్రీబాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సైతం నిర్వహిస్తున్నట్లు వివరించారు. మహిళల అభ్యున్నతి కోసం 15 రకాల వ్యాపారాలను అందుబాటులోకి తీసుకువచ్చామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మహిళలు ఆర్‌టిసి బస్సులు నడిపించేందుకు కృషి చేయాలంటూ 150 బస్సులను ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమాజంలో మహిళలకు గౌరవం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళు విధిగా ఇస్తామని వివరించారు. సన్న వడ్ల్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, సంక్రాంతి పండుగ తరువాత రేషన్ కార్డులను సైతం ఇవ్వనున్నట్లు తెలిపారు.

షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంఎల్‌ఎ వీర్లపల్లి శంకర్ ఎంతో పరితపిస్తున్నారని, ఎప్పుడు తన వద్దకు వచ్చినా బిటి రోడ్లు, సిసి రోడ్డు, భవనాలు కావాలంటూ అడుగుతుంటారని గుర్తు చేశారు. మధురాపురంలో పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరడంతో మంత్రి స్పందిస్తూ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి మంజూరు చేసేందుకు కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇదిలావుండగా, మధురాపురం గ్రామానికి మంత్రి సీతక్క వస్తున్న నేపథ్యంలో గ్రామ మహిళలు మంగళ హారతులు, బోనాలతో ప్రత్యేకంగా స్వాగతం ఫలికారు. పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు షాద్‌నగర్ బైపాస్ రహదారి వద్ద ఎంఎల్‌ఎ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మంత్రికి పూలబోకేతో ఘనంగా స్వాగతం ఫలికారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎంఎల్‌ఎ కాశిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసిలు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పి.వెంకట్‌రాంరెడ్డి, తాండ్ర విశాల శ్రావణ్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి భార్గవ్‌కుమార్‌రెడ్డి, షాద్‌నగర్ ఆర్‌డిఓ సరిత, తహశీల్దార్ పార్థసారధి, ఎంపిడిఓ బన్సర్‌లాల్, ఎపిఎం నాగేష్, పంచాయతీరాజ్ శాఖ ఏఇ గోపాల్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News