Thursday, January 9, 2025

రూ.2600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మాణం:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రూ.2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఆవాసం నుంచి గ్రామపంచాయతీ, అక్కడ నుంచి మండలానికి, జిల్లా కేంద్రానికి రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. సరైన రహదారి సౌకర్యాలు లేక పోవడమే పల్లెల వెనకబాటుకి కారణమని ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాన్ని చేపడుతోందని అన్నారు. ఎర్రమంజిలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో రూరల్ ఇంజనీర్లతో మంత్రి సీతక్క బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ కనక రత్నం, చీఫ్ ఇంజనీర్లు, సీఈలు, ఈఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రోడ్ల నిర్వహణ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

ఇందుకు అనుగుణంగా రూరల్ ఇంజనీర్లు కార్యాచరణ సిద్ధం చేయాలని, కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలని సూచించారు. ఇష్టా రీతినా అంచనాలను సవరించొద్దని తెలిపారు. 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని అన్నారు. ఇంజనీర్లే ఈ దేశ నిర్మాతలని అన్న మంత్రి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాకతీయుల కాలం నాడు కట్టిన కట్టడాలు ఇంకా పటిష్టంగా ఉన్నాయని గుర్తు చేశారు. అదే రీతిన గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీర్లు కట్టే నిర్మాణాలు 10 తరాలు ఉండేవిధంగా చూడాలని పేర్కొన్నారు. మహానగరాల్లో రోడ్లు మెరిసినట్టుగానే పల్లెల్లో రహదారులు మెరవాలని, ఆ బాధ్యత గ్రామీణ విభాగానికి చెందిన ఇంజినీరింగ్ అధికారులదేనని అన్నారు. పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం జరగాలని అన్నారు. నాణ్యతపై రాజీ పడొద్దని, జిల్లా స్థాయిలో రూరల్ ఇంజనీర్లు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని అన్నారు. పనుల పురోగతి నివేదికలను ప్రతి 15 రోజులకు నివేదించాలని అన్నారు.

పదేళ్లయినా గుండివాగు బ్రిడ్జి పూర్తి కాలేదు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుండివాగు బ్రిడ్జి 10 ఏండ్లుగా పూర్తికాలేదని, దీనివల్ల 40 మంది ప్రజలు వాగు దాటలేక మృత్యువాత పడ్డారని మంత్రి అన్నారు. గతంలో తన నియోజకవర్గంలో సరైన గ్రామీణ రోడ్లు లేక ఎంతో మంది ఆత్మీయులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని చెప్పారు. పట్టణాల్లో ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు ఉన్నాయి, కానీ చాలా గ్రామాల్లో కనీస రోడ్డు సదుపాయం లేకపోవడం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల పల్లెలకు రహదారి సౌకర్యం కలిగిస్తేనే అసలైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఎస్టి వర్గానికి చెందిన తనకు పంచాయతీరాజ్ శాఖ అప్పగించారని అన్నారు. రూరల్ ఇంజనీర్లు సహకారం ఉంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. రోడ్డు సదుపాయం లేని ఆవాసాలు, గ్రామాలు ఉండొద్దని, ఆ లక్ష్యంతో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ భాగం పని చేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News