Thursday, January 23, 2025

గంటకు మూడు కోట్లు వడ్డీ

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వం అప్పుల వల్ల గంటకు మూడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా తమ ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మేలు చేస్తోందన్నారు. సోమవారం బంజారాహిల్స్లోని కొమరం భీమ్ ఆదివాసి భవనంలో గిరిజన సంక్షేమంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల కోసం హెల్త్ మానిటరింగ్ యాప్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిన పలువురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహుకరించారు. కాస్మోటిక్, డైట్ చార్జీలు భారీగా పెంచిన సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. చార్జీలు పెంచేందుకు కృషిచేసిన మంత్రి సీతక్కను గిరిజన గురుకులాలు ఆశ్రమ పాఠశాలల టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ఘనంగా సన్మానించారు. ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రిన్సిపాల్స్ ను మంత్రి సీతక్క సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను ఏ శాఖలో ఉన్నా మనసు మాత్రం గిరిజన సంక్షేమంపై ఉంటుందని అన్నారు. నా ప్రాణం ఆదివాసీ, గిరిజనులు, చెంచుల గురించి కొట్టుకుంటుందన్నారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు అచ్చంపేట వంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల పదోన్నతులు కల్పించారని, బదిలీల ప్రక్రియను పూర్తి చేశారని వివరించారు. దీంతో 5 వేల మంది ఆశ్రమ పాఠశాల టీచర్లకు ప్రయోజనం జరిగిందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగులు, టీచర్లు వారధులని, టీచర్లు మనసుపెట్టి పని చేయాలని సూచించారు. విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూసుకోవాలని, సొంత పిల్లల్లాగానే వారిని తీర్చిదిద్దాలని అన్నారు. అందరిలో కెల్లా గిరిజనవిద్యార్థులను ముందంజలో నిలిపేలా పనిచేయాలని, అప్పుడు విద్యార్థులు మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారన్నారు.

నాది కూడా హాస్టల్ జీవితమే చిన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని మంత్రి సీతక్క అన్నారు. హాస్టల్ పిల్లలంటే చులకన భావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనల్ని అవహేళన చేసే వారికి గుణపాఠం చెప్పేలా కసితో కష్టపడాలి.. అప్పుడే ఎదుగుతామని సూచించారు. గుడాలు, తండాలు, పెంటల నుంచి వచ్చిన పిల్లలు జాతీయ, అంతర్జాతీయ క్రీడ పోటీల్లో పథకాలు సాధిస్తున్నారని, గిరిజన విద్యార్థులను అన్ని రకాలుగా ప్రత్సహిస్తామని మంత్రి చెప్పారు. వేయిలో ఒకరిగా కాకుండా సమాజం గుర్తు పెట్టుకునేలా పనిచేయాలని సూచించారు. 16 ఏళ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను మూడు రేట్లు పెంచామన్నారు. ఏడేళ్ల తర్వాత డైట్ చార్జీలను 40 శాతం పెంచామన్నారు. గత ప్రభుత్వం విద్య వ్యవస్థకు చేసిదేం లేదని మండిపడ్డారు. హాస్టళ్ల కోసం గతంలో కొనుగోలు చేసిన వస్తువులు సరిగా లేవని, నాసిరకం వస్తువుల కొనుగోలుపై విచారణ జరిపిస్తామన్నారు. హాస్టల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్న చిన్న సమస్యలు సృష్టించి బయట శక్తులు మనకు అపఖ్యాతి తెచ్చే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఐటిడిఎ పనితనాన్ని మెరుగు పరచాలన్నారు.

గిరిజనుల సంక్షేమం కోసం రూ. 17 వేల కోట్లు కేటాయించారని, సమగ్రంగా బడ్జెట్‌ను వినియోగించుకోవాలన్నారు. ఐటిడిఎ పిఓలు చాలా పవర్ఫుల్ అని, ఆ ప్రాంతాల పరిపాలకులు మీరేనని అన్నారు. విస్తృతంగా పర్యటిస్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయన్నారు. ఉపాధి అవకాశాల కోసం మన ప్రాంతాన్ని దాటి వెళ్లేలా తీర్చిదిద్దాలని, ఉన్న ఊరిలోనే ఉపాధి రావాలంటే కష్టమన్నారు. హెల్త్ మానిటరింగ్ యాప్ ను తీసుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. ఎ.శరత్, ఇతర అధికారులతో కలిసి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల పదోతరగతి ఫలితాలు, గురుకులాల వారిగా ఇంటర్, డిగ్రీ ఫలితాలు, 2025 పదోతరగతి, ఇంటర్ పరీక్షల సంసిధ్ధత, డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు నేపథ్యంలో కొత్త మెనూ పాటించడం, ప్రధానమంత్రి ధర్తి ఆబ జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల స్థాయి పెంపు, రాష్ట్ర స్థాయి స్పోర్ట్ మీట్, జాతీయ, అంతర్జాతీయ స్థాయి మెడల్స్ సాధించడం, ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్‌లు తదితర అంశాలపై సమీక్షింద్చరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News