పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్ నేత, శాసనసభ్యుడు హరీష్ రావుకి లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క అన్నారు. 2023 మార్చి 13న కలెక్టరేట్ల ముందు వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపిన వార్త కథనాలను మరిచారా? అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. ఆయన ఆర్దిక మంత్రిగా ఉన్నప్పుడే నెలల తరబడి జీతాలు రాక పంచాయతీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జీతాలు ఇవ్వకుండా అవస్థలకు గురి చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం శూన్యమని అన్నారు.
పంచాయతీ కార్మికులు, ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల వంటి వేల మంది చిరు ఉద్యోగులను కనీసం మీ ప్రభుత్వం గుర్తించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తప్పులను మేము సరిదిద్దుతున్నాం, మీ హయాంలో అన్యాయానికి గురైన వర్గాలను ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేస్తున్నామని గట్టిగా బదులిచ్చారు. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించే విధానాన్ని రూపొందించి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఇకపై 92 వేల మంది పంచాయతీ స్థాయి సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు తరహాలోనే జీతాలు చెల్లిస్తోందని తెలిపారు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని ఆమె హితవు పలికారు.