మంచిర్యాల : కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభ నాంది అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్‌చార్జి, మంత్రి సీతక్క తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ ఎంఎల్‌ఎ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఈ ప్రాంత ఎంఎల్‌ఎను గెలిపించడంలో కీలక పాత్ర వహించిన జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇంద్రవెల్లి సభను ప్రేంసాగర్‌రావు భుజాల మీద వేసుకొని ముందుండి నడిపించారని మంత్రి గుర్తు చేశారు. ఆ సభతో కాంగ్రెస్ నాయకుల్లో స్ఫూర్తి నింపారని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో కాంగ్రెస్‌ది ప్రత్యేక అనుబంధమని, అభివృద్ధిలో మొదటి అడుగు ఇంద్రవెల్లి సభ నుండే ప్రారంభం అయ్యిందని, కనుక శుక్రవారం జరిగే ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
ఆసిఫాబాద్‌లో వైద్యులు సరిగా లేక వైద్యం అందలేదని, నిరుద్యోగులను నిలువునా ముంచారని మండిపడ్డారు. ఇక్కడి సమస్యలు గుర్తించి అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపడితే, ఆ ప్రాజెక్టులను ఆపివేసి అవినీతి కూపంగా కాళేశ్వరం చేశారన్నారు. అభివృద్ధిపథంలో ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మహిళలను దృష్టిలో ఉంచుకొని ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే అది జీర్ణించుకోలేని బిఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేస్తూ, ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఉద్యమం చేపట్టారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంను తమ ప్రభుత్వం గుర్తించి అవకాశం ఇస్తే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎంఎల్‌ఎ ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ… ఆగస్ట్టు 9, 2021 మొట్టమొదటిసారి ఇంద్రవెల్లిలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ జరిగిందని, మళ్లీ అక్కడే శుక్రవారం జరుగనుందని తెలిపారు.
ఇంద్రవెల్లి సభకు మంచిర్యాల నియోజకవర్గం నుండి సుమారు 135 బస్సులలో 7 నుంచి 8 వేల మంది తరలివస్తారని అన్నారు. మంచిర్యాల పట్టణానికి తాగు నీటి సమస్య ప్రధానంగా ఉందని, దానిని గత సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఇటీవల కాలంలో మంచిర్యాలలో తాగునీటి సమస్య తీర్చడానికి నల్లాలు ఏర్పాటు చేశామని, ఎండాకాలంలోపు పూర్తి స్థాయిలో మంచినీరు అందిస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ త్వరలోనే 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ప్రయాణికులకు రెండు లక్షల ఇన్సూరెన్స్ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్‌రావు, ఐఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షుడు జనక్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు సిరిపురం రాజేశం, తూముల నరేష్, పూదరి ప్రభాకర్, ఉప్పలయ్య, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.