Wednesday, September 18, 2024

దేవాదులతో దేదీప్యమానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి/కన్నాయిగూడెం: రూ.17,500 కోట్లతో దేవాదుల ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తెలిపారు. ములుగు జిల్లా, కన్నాయిగూడెం మండ లం, తుపాలకుల గూడెంలోని జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులను మంత్రులు శు క్రవారం సందర్శించారు. దేవాదుల పంప్‌హౌస్‌కు చేరుకుని ఇంటెక్ పంప్ హౌస్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా తుపాకులగూడెం సమ్మక్క సాగర్ వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్‌పి డాక్టర్ శబరీష్, ఐటిడిఎ పిఓ చిత్ర మిశ్రా పూలబొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం గంగారం దేవాదుల వద్ద సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..దేవాదుల నీటితో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలోని పంట భూములను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. నీటి పారుదల శాఖ అధికారులు బాధ్యతతో, నిజాయితీగా పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్ దేవాదుల ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల వివరాలను పిపిటి ద్వారా మంత్రుల బృందానికి వివరించారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్ట్‌కు ప్రత్యేక సార్థకత ఉందని, 2026 మార్చిలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఆమెతోనే ప్రారంభింపజేస్తామని తెలిపారు. గత పదేళ్లుగా కెసిఆర్ కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని, ప్రాజెక్ట్‌లతో పేరుతో లక్షల కోట్లు వృధా ఖర్చు చేశారని అన్నారు. గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి కోసం లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్ట్‌లు కట్టిందని, అవి ఎన్నో రోజులు నిల్వలేకపోయాయని, అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిదర్శనమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధించాలని, ప్రత్యేకంగా గ్రామీణ తెలంగాణ ముఖచిత్రం మార్చాలని, ప్రతి ఎకరాకు నీరందించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నామని అన్నారు. స్పష్టమైన టైమ్‌లైన్ పెట్టి దేవాదుల ప్రాజెక్ట్‌ను ఖచ్చితంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గతంలో 38 టిఎంసిల సామర్థం ఉన్న ప్రాజెక్ట్‌ను మార్చి 2026 కల్లా 60 టిఎంసిల సామర్ధంతో ప్రాజెక్ట్ పూర్తి చేసి 5 లక్షల 57 వేల ఎకరాలను నీరందిస్తామన్నారు.

తుదిదశకు చేరుకున్న మూడో దశ పూర్తి అయిన పక్షంలో 2 లక్షల 40 వేల ఎకరాల ఆయకట్టుకు 10 పంప్ హౌస్‌ల ద్వారా 1750 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 2008 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవాదుల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారని అన్నారు. సమ్మక్క బ్యారేజీ ద్వారా 3 ఫేస్‌లతో 26 వందల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసే సామర్థం గల మోటార్లు ఉన్నాయన్నారు. గతంలో బ్యారేజీఏర్పాటు చేయకముందు 170 రోజుల్లో 38 టిఎంసిలతో లిప్ట్ చేయవచ్చని అంచనా వేయగా, ఇప్పటివరకు సమ్మక్క బారేజీ నుండి 5 నుంచి 6 టిఎంసిలు నిలువ చేసే దిశగా ఉండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి భూ సేకరణ సమస్య ఉందని, ఈ సమస్యను మైత్రీ బంధంతో పరిష్కరించడం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శిని ఆ రాష్ట్రానికి పంపించిదన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు ద్వారా ములుగు నియోజకవర్గానికి సాగు నీరు రావడం లేదని, కన్నాయిగూడెం ప్రాంతంలో తుపాకుల గూడెం బ్యారేజీ, దేవాదుల బ్యారేజీ నిర్మాణం కోసం భూమి కోల్పోయిన రైతులకు మానవీయ కోణంలో ఆలోచించి తగినంత నష్టపరిహారం అందిచాలన్నారు. మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరు నాగారంలో కెనాల్ పై ఏర్పాటు చేసిన లిప్ట్ సరిగా పనిచేయక తాగునీరు అందడం లేదన్నారు. పాకాల ద్వారా నర్సంపేటకు నీరందిస్తూ కొత్తగూడకు కూడా నీరందేలా ప్రణాళిక చేయాలన్నారు. రామప్ప నుండి లక్నవరానికి కెనాల్ మంజూరు చేశారని, కానీ ఇప్పటి వరకు భూసేకరణ జరగలేదన్నారు. రామప్ప లక్నవరం లింకు ద్వారా త్వరగా పూర్తి చేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News