సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క మంగళవారం పరామర్శించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీతో కలిసి కిమ్స్ ఆసుపత్రిని ఆమె సందర్శించి శ్రీతేజ్ కి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని చూసి భావోద్వేగానికి లోనైనా మంత్రి సీతక్క శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని,
వెంటిలేటర్ చికిత్స నుంచి శ్రీతేజ్ బయటకి వచ్చాడని అన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి శ్రీతేజ్ కు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుని బయటికి రావాలని కోరుకుంటున్నామని అన్నారు. డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకొని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామని తెలిపారు. శ్రీతేజ్ సంతోషంగా బయటికి వస్తాడు అన్న నమ్మకం ఉందని అన్నారు. శ్రీ తేజ్ ప్రాణాలను కాపాడేందుకు ఇటు ప్రభుత్వంచ, అటు డాక్టర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడన్న ఆశతో ఉన్నామని పేర్కొన్నారు.