రాజస్ధాన్‌లోని ఉదయ్ పూర్‌లో ఈ నెల 18 మంగళవారం జరిగే ‘వాటర్ విజన్ -2047’ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బయలుదేరి వెళుతున్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో రెండు రోజుల పాటు జరిగే వాటర్ విజన్- 2047 సదస్సులో మంత్రి సీతక్క పాల్గొంటారని ఆయా వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం 8.45 కి రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఉదయ్ పూర్ బయలు దేరుతారు.
వాటర్ విజన్ సదస్సులో పాల్గొని తెలంగాణలో అమలవుతున్న గ్రామీణ మంచి నీటి సరఫరా వ్యవస్థపై మంత్రి సీతక్క ప్రసంగిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలను కేంద్రం, ఇతర రాష్ట్రాల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. గ్రామీణ మంచి నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం కోసం తీసుకున్న చర్యలను మంత్రి సీతక్క వివరిస్తారు. తాగు నీటి వ్యవస్థ స్థిరత్వం కోసం అనుసరిస్తున్న విధానాలను మంత్రి వివరిస్తారు. ఇంటింటికి రక్షిత మంచి నీటిని అందించేందుకు వీలుగా కేంద్ర ఆర్ధిక సహకారాన్ని మంత్రి సీతక్క కోరనున్నారు.