Tuesday, November 5, 2024

రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదు: సింగిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని, అర్ధం లేకుండా మాట్లాడుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బిఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ భానుప్రసాద్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, తాతా మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అంశాలవారీగా సైద్దాంతిక ప్రాతిపదికన ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చని, సందర్భోచితంగా సహేతుకమైన విమర్శలు చేయవచ్చు కానీ, అర్ధంపర్ధం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదనీ మంత్రి రేవంత్‌కు హితవు పలికారు. రెండో సారి ప్రజలు ఆమోదించిన ఉద్యమనేత ముఖ్యమంత్రి కెసిఆర్ అని,

ఆయన్ను దుర్భాషలాడడం సహేతుకం కాదనీ, రేవంత్ వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయమై రేవంత్ ఆలోచించుకోవాలని మంత్రి సూచించారు. కెసిఆర్‌ను విమర్శించినంత మాత్రాన రేవంత్ పెద్దవాడు అయిపోడని, అడ్డగోలుగా మాట్లాడితే ఏదో అయిపోతానన్న అపోహలో రేవంత్ ఉన్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చంద్రబాబు చర్యల్లో నీ పాత్ర అబద్దమా ? టివిల్లో పట్టుబడింది నిజమే కదా ? నీ చర్యలను నీ పార్టీ శ్రేణులే హర్షించడం లేదని రేవంత్‌రెడ్డి ఉద్ధేశించి మంత్రి వ్యాఖ్యానించారు. పరిమితులకు లోబడి హుందాగా మాట్లాడితే అర్ధవంతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎంచుకున్న పనుల్లో ప్రాధాన్యతా క్రమంలో కొన్ని మిస్ అవుతాయని, వాటిని చేసినట్లు తాము చెప్పుకోవడం లేదని, సమయాన్ని బట్టి వాటిని పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు.

రేవంత్ భాష మార్చుకో
భూత కల్పనలతో కూడిన ఆధారం లేని ఆరోపణలు తాత్కాలికంగా సంచలనం కావచ్చు కానీ, కాలక్రమంలో అవి నిలబడవని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఎదుటివారిని నోటికొచ్చినట్లు దూషించడం పద్ధతి కాదనీ, భాష మార్చు కోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. రూ.86 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తారు, కానీ, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడే తీరు ఇదేనా ? వ్యక్తులను తూలనాడడం ఇదేం పద్ధతి ? ప్రతిదానికి ఓ హద్దు ఉంటుందని మంత్రి హెచ్చరించారు. రేవంత్ తన చర్యలు, నోటి దురుసు ద్వారా అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బతికుండగానే పిండం పెడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీని బతికించుకోవాలని ఆ పార్టీ కోసం నిలబడే వాళ్లు రేవంత్ వ్యాఖ్యలను గమనించి, ఆలోచించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు.

రేవంత్ మాట మీద నిలబడలేదు
కొడంగల్‌లో ఓడిపోతే రేవంత్‌రెడ్డి రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఆయన్ను సన్యాసం చేయమని ఎవరైనా అడిగారా ? ఆయనే చెప్పారు. ఆయనే పాటించలేదు. ఆయన మాట్లాడిన మాట మీద ఆయన నిలబడలేదు. అందుకే ఆయన మాటలకు విలువలేదు. అటువంటి వ్యక్తితో చర్చకు రావాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు మా ప్రభుత్వంలోని ఎవరూ పాల్పడలేదని, ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. మీ స్థాయికి దిగజారి విమర్శించేంత దుస్థితిలో తాము లేమని, విచక్షణతో మంచి, చెడ్డలు బేరీజు వేసుకుంటున్నామని ఆయన తెలిపారు. మీ మాయలో పడి అభివృద్ధి, సంక్షేమం పక్కకుపెట్టి మిగతా అంశాలను ముందేసుకునే పరిస్థితిలో తాములేమన్నారు. ఇటువంటి వారి అసందర్భ, దుర్మార్గపు వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వారు బుద్దిచెబుతారని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News