Friday, November 22, 2024

తెలంగాణ రాష్ట్రం బిక్ష కాదు.. పోరాడి లాక్కున్నాం:నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తుక్కుగూడ సభలో కాంగ్రెస్ హామీలు, నేతల ప్రసంగాలపై ఒక ప్రకటనలో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పదే పదే తెలంగాణ పోరాటాలను అవమానిస్తున్నదని, తెలంగాణలో ఆత్మబలిదానాలు రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ చేసిన కాలయాపన ఫలితమేనని అన్నారు. సిఎం కెసిఆర్ గారి ఆమరణదీక్షకు దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ ఆంధ్రా లాబీకి తలొగ్గి ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకున్నది. డిసెంబరు 23, 2009 నుండి జూన్ 2, 2014లో రాష్ట్ర ఏర్పాటు వరకు కెసిఆర్ తెలంగాణలో సబ్బండ వర్గాలను ఏకతాటిపై నిలబెట్టి వివిధ రూపాలలో ఉద్యమాన్ని పట్టు సడలకుండా నిలబెట్టడంతో రాజకీయ అస్తిత్వం కోసమే కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది.ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో బుద్ది చెప్పి ఉద్యమించిన కెసిఆర్ కు అండగా నిలిచారు.

భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణను కాంగ్రెస్ బలిపెట్టింది.కాంగ్రెస్ చర్యలతో తెలంగాణ రెండు తరాల భవిష్యత్ ను కోల్పోయింది. 48 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వివక్ష, అసమానతల ఫలితమే తెలంగాణలో దుర్భిక్షం. తెలంగాణను ఎండబెట్టి, ప్రజలను వలసల పాలు చేసి ఆంధ్రాకు నీటిని తరలించారు. కాంగ్రెస్ పాలనలో వైఫల్యాల మూలంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉదృతమయింది. ఒంటె పెదవులకు నక్క ఆశపడ్డట్లు .. అలవిగాని హామీలు ప్రజల ముందు పెట్టి అధికారం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నది. తుక్కుగూడ సభలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలుచేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. జాతీయపార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ రాష్ట్రానికో విధానం అవలంబిస్తున్నది. కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్నదని,తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు స్థానం లేదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News