Thursday, December 26, 2024

పక్కా పథకం ప్రకారమే దాడి: మంత్రి శ్రీధర్‌బాబు

- Advertisement -
- Advertisement -
  •  కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించిన కుట్రదారుల గుట్టువిప్పుతాం
  •  దాడి వెనుక ఎంతటి వారున్నా వదిలి పెట్టం
  •  అధికారం పోయిందనే అక్కసుతో బిఆర్‌ఎస్ కుట్రలు
  •  మంత్రి శ్రీధర్‌బాబు ధ్వజం

మనతెలంగాణ/హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడికి సంబంధించి మంత్రులు, ఎంపిలు, కాంగ్రెస్ నాయుకులు ఖండించారు. నిందితులను వెంటనే గుర్తించి వారిని శిక్షించాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. దీనికి సంబంధించి మంగళవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సిఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పథకం ప్రకారమే కొందరు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్‌పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌పై దాడి ఘటనపై కచ్చితంగా సమగ్ర విచారణ చేస్తామన్నారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో కుట్రదారులు తప్పుదోవ పట్టించి కలెక్టర్‌ను గ్రామంలోకి తీసుకెళ్లింది ఎవరన్న దానిపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. లగచర్ల ఘటన వెనక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరూ ప్రయత్నించిన చర్యలు తప్పవని ఆ యన హెచ్చరించారు. రైతులు, ప్రజలకు ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పొచ్చని ఇలా అధికారులపై భౌతికి దాడులకు పాల్పడటం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు హితవు పలికారు. సమస్యలపై ప్రజాస్వా మిక పద్ధతిలో ముందుకెళ్తున్నామన్నారు. రైతులను సభాస్థలికి రాకుండా కొందరు అడ్డగించారని దీంతో రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్ వెళ్లారని, ఈ క్రమంలోనే పథకం ప్రకారం అధికారులపై దాడి చేశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విధానాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉపేక్షించమని ఆయన తేల్చి చెప్పారు. అప్రజాస్వామికంగా దాడులు చేస్తే సహించమని మంత్రి శ్రీధర్‌బాబు వార్నింగ్ ఇచ్చారు. అధికారం పోయిందన్న ఆక్రోషంతో బిఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల ముసుగులో కలెక్టర్‌పై దాడి: ఎంపి మల్లు రవి
ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని పథకం ప్రకారం బిఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడంగల్లో భూసేకరణపై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారని బిఆర్‌ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్‌పై దాడి చేశారని దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
దాడి దురదృష్టకరం: ఎంపి చామల
ప్రభుత్వ అధికారులపై దాడిని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వికారాబాద్ కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి దురదృష్టకరమన్నారు.
కుట్ర చేసిన వ్యక్తి పట్నం నరేందర్‌రెడ్డి అనుచరుడు: సామ
దాడి ఘటనపై పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారని ఆయన తెలిపారు. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్‌గా పోలీసులు గుర్తించారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News