Sunday, November 24, 2024

నిర్వాసితులకు న్యాయం చేస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మూసీ నిర్వాసితులను అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రెంట్ ను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేర్చుతామని, సొంతిల్లు లేనివారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని,అందరినీ కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామని వ్యాఖ్యానించారు. పిపిపి కింద మూసీ ప్రాజెక్ట్ చేపడతామని, మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకువస్తామని వెల్లడించారు. మూసీపై లింక్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ఏం చేసింది..? అని ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని శ్రీధర్‌బాబు విమర్శించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు బిఆర్‌ఎస్ ఏం చేసింది అని నిలదీశారు. మల్లారెడ్డి అనే రైతు చితిపెట్టుకొని ఆహుతయ్యారని చెప్పారు. 2013 భూనిర్వాసితుల చట్టాన్ని అమలు చేయకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త జిఒ తీసుకొచ్చిందని మండిపడ్డారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితులు విషయంలో హైకోర్టు అనేక సార్లు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. బుల్డోజర్ పాలసీని అమలు చేసిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినవో అక్కడికే బుల్డోజర్ పోయిందని చెప్పారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల పైకి, రైతు సోదరులపైకి బుల్డోజర్‌లు పంపించింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని విమర్శించారు. తమ హస్తం ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం దామోదర రాజనర్సింహ పోరాటం చేశారని, ఉత్తమ్, భట్టి, రేవంత్ రెడ్డిలను మల్లన్న సాగర్ వైపు రాన్విలేదని గుర్తు చేశారు. గతంలో తాము మల్లన్నసాగర్ దగ్గరకు వెళ్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసులతో తమను అరెస్టు చేశారని గుర్తుచేశారు.

ప్రజా పాలనలో ప్రతిపక్షం ఎక్కడికి వెళ్లినా అనుమతులు ఇస్తున్నామని, పోలీసులతో ప్రతిపక్షాలను అడ్డుకోలేదని చెప్పారు. ఇప్పుడు తాము బిఆర్‌ఎస్ నేతలను అడ్డుకున్నామా..? అని ప్రశ్నించారు. భూనిర్వాసితులపై మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్‌కు లేదు అని, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తుందని తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రజలనురెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, డబ్బులిచ్చి ముఖ్యమంత్రి, ప్రభుత్వంపైన వ్యతిరేకంగా మాట్లాడిస్తోందని ఆరోపించారు. అరాచక శక్తులను బిఆర్‌ఎస్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News