తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా మారుస్తాం
రాష్ట్రాన్ని దేశంలోనే సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు
కృషి ఇప్పటికే ఏడు సైబర్ క్రైమ్ ఠాణాల
ఏర్పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హెల్ప్‌లైన్
ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి సోషల్
మీడియాలో ఫేక్ న్యూస్‌ను నియంత్రించాల్సిందే
షీల్డ్ కాంక్లేవ్2025 సదస్సులో సిఎం రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా మార్చుతామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్‌ఐసిసిలో మం గళ వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు షీల్డ్ కాం క్లేవ్ -2025’ సదస్సు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాల మోసాలబారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసే లక్షంతో కొత్త ఆవిష్కరణలపై కాంక్లేవ్ ఏర్పాటు చేయ గా, సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, సైబర్ ఫ్యూజన్ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సె క్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్ , సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను అభినందిస్తున్నానన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 సైబర్- సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కొంతకాలంగా ఫేక్ న్యూ స్ ప్రధాన ముప్పుగా పరిణమించిందని, ఇది పౌరులకు, ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారిందన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారంతో గందరగోళ పరిస్ధితికి దారి తీస్తుందన్నారు. సైబర్ సెక్యూరిటీ
సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిపుణులు, ఐటీ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, అన్ని రకాల వనరులు ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు. డిజిటల్ సేఫ్టీ, ఫ్యూచర్ గురించి చర్చించేందుకు షీల్డ్ 2025 వేదికగా మారిందని, తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ గా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సైబర్ మోసగాళ్ల బారినపడిన వారు వెంటనే ఫిర్యాదు చేయడానికి 1930 నంబర్ ను విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సైబర్ నేరాలపై 24/7 హెల్ప్‌లైన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకట అన్నారు. సైబర్ మోసాలలో నగదు రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉందని సీఎం వివరించారు. గత ఏడాది సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేశామని, ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని, ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు ఎక్కడో ఉండి మన డబ్బులు దొంగిలిస్తున్నారని అన్నారు. నేరం ఎక్కడ నుంచి చేశారో కనుక్కోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. సైబర్ నేరగాళ్లు కూడా సాంకేతికను అందిపుచ్చుకోవడంతో నేరాల శైలి కూడా మారుతోందన్నారు. పోలీసు వ్యవస్థ దేశం మొత్తం ఒక యూనిట్‌గా పని చేస్తేనే సైబర్ నేరాలు అరికట్టగలమని- సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
సమాజంలో చాలా వేగంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని సీఎం అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో హత్యలు అనేవి పెద్ద నేరాలుగా ఉండేవని, కానీ ప్రస్తుతం వాటికి మించి సైబర్ నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటిని నియంత్రించడంలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ముందుందని గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖను అభినందించిందని గుర్తు చేసారు. నేరాల జరిగే విధానం వేగంగా మారుతున్న క్రమంలో ‘షీల్డ్ 2025’ అత్యంత కీలక సదస్సుగా సీఎం కొనియాడారు. కొత్త కొత్త నేరాల సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు సంబంధిత విభాగాలను బలోపేతం చేయాలని, నేరం జరిగిన తరువాత పట్టుకోవడం కాదు, నేరం జరగకుండా నిరోధించగలుగాలని సూచించారు. రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చే లక్షంగా పనిచేద్దామని’ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఈజీ మనీ కి ఆశ పడకుండా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే లోన్ యాప్స్ బారిన పడే అవకాశం ఉండదని అన్నారు. అలాగే నగదు ప్రైజ్, లాటరీ మెస్సేజ్‌లు వస్తే అలాంటి లింక్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మోసపోయే అవకాశమే ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
సైబర్ సెక్యూరిటీ అందరి బాధ్యత : మంత్రి శ్రీధర్‌బాబు
సైబర్ సెక్యూరిటీ అందరి బాధ్యత అని, సైబర్ నేరాలను తగ్గించేందుకు కాకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేసే పరిస్థితి రావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ సాయంతో గిగా వాట్ డేటా సెంటర్ ను నెలకొల్పాలని సంకల్పించామన్నారు. సైబర్ స్పేస్‌లో ఆధిపత్యం కోసం అన్ని దేశాలు ప్రయత్నం చేస్తు న్నాయని, ఇలాంటి తరుణంలో డేటా భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారిందన్నారు. సైబర్ నేరస్తులు డబ్బుల కోసం కాకుండా డేటా కోసం నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఆ సమాచారంతో మన వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు.
సైబర్ నేరాలను తగ్గించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇటీవల సైబర్ నేరస్థులు సుమారు రూ.350 కోట్లు లూటీ చేస్తే మన పోలీసులు రూ. 185 కోట్లు రికవరీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏటా 7 బిలియన్ డాలర్ల విలువైన ఫైర్ వాల్ మొదలు యాంటీ వైరస్ తదితర సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ ను విదేశాల నుంచి ఎగుమతి చేసుకుం టున్నామన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను తయారు చేస్తున్న దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నా, ఇతర దేశాల నుంచి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ ను దిగుమతి చేసుకుంటుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో నిపుణులు తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించా రు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటా మన్నారు.
మన ఆలోచనలు సాంప్రదాయబద్ధంగా కాకుం డా కొత్తగా, నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని సూచించారు. మన గురించి.. మన కంటే ఎక్కువ గూగుల్‌కే తెలుసంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ వల్ల అవకాశాలతో పాటు సవాళ్లు ఎదురవుతు న్నాయన్నారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కే కొలదీ సైబర్ నేరగాళ్లు మోసాలు చేసేందుకు కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ నిపుణులకే సవాలు విసురుతున్నా రన్నారు. కృత్రిమ మేథ(ఏఐ) వచ్చిన తర్వాత వారి పని మరింత సులువయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డార్క్ వెబ్‌లో డాలర్ పెడితే మనకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా దొరుకుతుందన్నారు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు 10 ట్రిలియన్ డాలర్ల సొమ్ము కొల్లగొడుతున్నారన్నారు. భారత్ లో ఈ సొమ్ము రూ.15వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. చాలా మంది మోసపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదన్నారు. ఒక్కసారి డబ్బులు కోల్పోతే రికవరీ కష్టమని, ప్రజలే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ యువతను సైబర్ నిపుణులను తయారు చేస్తున్నామన్నామని వివరించారు.
సైబర్ క్రయిమ్ యూనివర్సల్ : డైరెక్టర్ శిఖా గోయెల్
సైబర్ నేరాలు యూనివర్సల్ ఛాలెంజ్‌గా మారాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ అన్నారు. వీటిని అరికట్టేందుకు ఈ సదస్సు ఒక మంచి వేదిక అవుతుందని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితనానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నామని అన్నారు. గత ఏడాది 2024 లో సైబర్ నేరాల్లో కాజేసిన రూ.350 కోట్లు తిరిగి రాబట్టగలిగామని అన్నారు. సైబర్ మోసగాళ్ల బారిన 18 వేల మంది బాధితులకు రూ.183 కోట్లను తిరిగి అందించగలిగామని శిఖా గోయల్ వివరించారు.
రోబోతో ముచ్చటించిన సిఎం రేవంత్
ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంక్లేవ్‌లో ఏర్పాటు చేసిన రోబోతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భం గా రోబోకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అధికారులను అడిగి రోబో వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిపుణులు, విద్యాసంస్థలు, ఎన్జీవోలు, బ్యాకింగ్ అండ్ ఫైన్సిలియన్ సర్వీసెస్, గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌లు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. డిజిపి డాక్టర్ జితేందర్, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, సైబరాబాద్ సిపి అవినాష్ మోహంతి తదితరులు
పాల్గొన్నారు.