Sunday, April 13, 2025

కంచ దాటలేదు

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి భూముల్లో వివాదాల్లేవు సెబీ నిబంధనలకు
అనుగుణంగానే బాండ్ల జారీ ఐసిఐసిఐ నుంచి
ఎలాంటి రుణాలు తీసుకోలేదు టిజిఐఐసి బాండ్ల
ద్వారా రూ. 9,995కోట్ల నిధులు సమీకరించాం
ఇందులో నుంచి రైతుభరోసాకు రూ.5,463కోట్లు,
రుణమాఫీకి రూ.2,146కోట్లు చెల్లించాం కంచ
గచ్చిబౌలి భూములపై ఫేక్ వీడియోలతో విద్యార్థులను
రెచ్చగొట్టారు రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు
రాకుండా ప్రతిపక్షాల కుట్ర సచివాలయంలో మీనాక్షి
నటరాజన్ సమీక్ష నిర్వహించలేదు సిఎం రేవంత్‌రెడ్డే
సిఎంగా ఉంటారు..ఉండి తీరుతారు : మంత్రి శ్రీధర్‌బాబు

మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలను పక్కదారి పట్టించేందుకు బిఆర్‌ఎస్ ప్ర యత్నాలు చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించా రు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కాపాడిందని, కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఏఐ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హెచ్‌సియూ భూములు, పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయంటూ విద్యార్థులను ప్రభావితం చేసిన ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు పెట్టబడులు, ఉద్యోగాలు రావొద్దని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

బాండ్ల ద్వారా మ్యుచువల్ పెట్టుబడులను సేకరించాం
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్ల జారీ ప్రక్రియ జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ఐసిఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. టిజిఐఐసి మార్కెట్ ఫోర్‌సెస్ ద్వారా 37 అంతర్జాతీయ సంస్థల నుంచి బాండ్ల ద్వారా మ్యుచువల్ పెట్టుబడులను సేకరించిందని ఆయన తెలిపారు. తక్కువ ఇంట్రెస్ట్ కావడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఈ నిధులను సేకరించిందన్నారు. రూ.5,200 కోట్ల భూమిని రూ.30వేల కోట్లకు చూపించారని కెటిఆర్ అంటున్నారని, సిబిఐ (సెక్యూరిటీ బ్యూరో ఆఫ్ ఇండియా) అనే రియల్‌ఎస్టేట్ సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం రూ.23 వేల కోట్ల వాల్యూ వచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సెబీ, ఆర్‌బిఐ కూడా దీనిని నిర్ధారణ చేసిందని ఆయన అన్నారు.

రూ.9,995 కోట్ల రుణం
దాదాపు 37 సంస్థలు బాండ్ల కొనుగోలు ద్వారా పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన వివరించారు. డిసెంబర్ 5వ తేదీ 2024లో రూ.9,995 కోట్లను బాండ్ల ద్వారా ప్రభుత్వం ఈ నిధులను సేకరించిందన్నారు. 9.35 శాతం ఇంట్రెస్ట్‌తో ఈ నిధుల సేకరణ జరిగిందన్నారు. తీసుకున్న నిధుల నుంచి రుణమాఫీకి రూ.2,146 కోట్లను, రైతుభరోసాకు రూ.5,463 కోట్లను, సన్నబియ్యం కోసం రూ.947 కోట్లను ప్రభుత్వం వినియోగించుకుందని ఆయన తెలిపారు.

గత ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీకే రుణాలు
సెబీలో రిజిస్ట్రర్ అయిన మర్చంట్ బ్యాంకర్‌ను టిజిఐఐసి నియమించుకుందని ఆయన తెలిపారు. ట్రస్ట్ ఇన్వెస్ట్ ఇండస్ట్రీ సంస్థ ఇతర రాష్ట్రాలకు నిధులను సమకూర్చిందన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 10.09 శాతానికి నిధులను సమకూర్చుకుందన్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపుగా 11 శాతం వడ్డీకి రుణాలు తీసుకుందని, గత ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీకే తమ ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. అంతేగాక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని, ఈ రుణమాఫీ టిజిఐఐసీ ద్వారా నిధులు సేకరించి మాఫీ ప్రక్రియను పూర్తి చేశామని ఆయన తెలిపారు.

గత ప్రభుత్వంలో సచివాలయ నిర్మాణం కోసం 207 చెట్లు నరికారు
బిఆర్‌ఎస్ గతంలో చేసిన తప్పిదాలను ప్రజలు మర్చిపోలేరని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ఆయనే కొనసాగుతారని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అవినీతిరహిత పాలన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అందరూ సమర్ధులేనని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనలో కెటిఆర్ రూ.10 నుంచి రూ.15 వేల కోట్ల వరకు బ్రోకర్లకు పంపించారని, దాని మీద ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చస్త్రశారు. తాము మర్చంట్ అంటున్నామని, ఆయన బ్రోకర్ అంటున్నారని ఆయన విమర్శించారు.

గత ప్రభుత్వం హరితహారం పేరుతో రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఎన్ని చెట్లు మిగిలాయో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. 207 చెట్లు సచివాలయ నిర్మాణానికి కొట్టారని, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటారా? అని మంత్రి ప్రశ్నించారు. 111 జీఓతో 12 లక్షల చెట్లు కొట్టారని, కానీ, నేటికీ గ్రీన్ స్టేట్ కాలేదన్నారు. నియోపోలిస్‌లో చెట్లు కొట్టడం, భూముల అమ్మకాలన్నీ ప్రజలకు చెబుతూ వస్తున్నారని మంత్రి అన్నారు. రాయదుర్గం, మొకిల, ఖానామేట్ ప్రాంతాల్లో భూములు విక్రయించినప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.

సచివాలయానికి ఎవరైనా రావొచ్చు
సచివాలయానికి ఎవరైనా రావొచ్చని, మీనాక్షి నటరాజన్ మంత్రులను కలవడానికి మాత్రమే వచ్చారని, ఆమె ఎలాంటి సమీక్షలో పాల్గొనలేదని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ విషయమై కావాలనే ప్రతిపక్షాలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు సైతం సచివాలయానికి వస్తారని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలా వద్దా అనేది బిఆర్‌ఎస్ నేతలు చెప్పాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం భూసేకరణ చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, భూసేకరణ నిబంధనల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం భూసేకరణ ఎన్నడూ చేయలేదని,

ఫార్మా సిటీ కోసం వేల ఎకరాల భూములను బిఆర్‌ఎస్ ప్రభుత్వం సేకరించలేదా అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తరిమికొట్టేందుకే మూసీ ప్రక్షాళన చేస్తుంటే పర్యావరణ రక్షణ ఏం వద్దు అని అడ్డుకోవాలని చూశారని, ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పర్యావరణ పరిరక్షణను అడ్డుకోవాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు దుయ్యబట్టారు. అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల లక్ష్యమని, ప్రజలను పక్కదారి పట్టించాలని బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.

జనసాంద్రత పెరగడంతో ఫ్యూచర్‌సిటీని నిర్మించాలని
రాజధానిలో ఉంటున్న అందరికీ నాణ్యమైన జీవనం అందించాలని, మూసీ పరివాహాక ప్రాంతంలో ఉంటున్న వారికి స్వచ్ఛమైన గాలి, వాతావరణం ఇవ్వాలని భావించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. నగరంలో నాణ్యమైన జీవనంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జనసాంద్రత విపరీతంగా పెరగడంతో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News