Sunday, December 22, 2024

నిజాం షుగర్స్‌ను పునః ప్రారంభించడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

బోధన్: తెలంగాణ ప్రజలు మార్పును కోరారని వారు కోరిన విధంగా తాము మార్పు చేసి చూపెడతామని త్వరలోనే నిజాం షుగర్స్ కర్మాగారాన్ని ప్రారంభిస్తామని నిజాం షుగర్స్ పునరుద్ధ్దరణ కమిటీ ఛైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజాంషుగర్స్ పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ హోదాలో శనివారం బోదన్‌కు వచ్చిన ఆయన కర్మాగారాన్ని పరిశీలించి అనంతరం రైతులు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 60 రోజుల్లోపే ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమిటీని వేశారని, ఆ పనిని తాము ప్రారంభించామని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ముఖ్యమన్నారు. ప్రజా సంక్షేమాన్ని వ్యతిరేకించే వారి పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని, అభివృద్ధిని కాంక్షించే వారిని ఆదరిస్తామని అన్నారు. నిజాం షుగర్స్ కర్మాగారాన్ని ప్రారంభించడం రైతులు చెరుకు పంట వేయడం రెండూ ఒకేసారి జరగాలన్నారు.

నిజాం షుగర్స్ కర్మాగారంపై కాంగ్రెస్ స్పష్టతతో ఉందని,గతంలో సైతం 2014, 18 సంవత్సరంలో తాము ప్రజలకు చెప్పామని, కానీ ప్రజలు నమ్మలేదని అన్నారు. అయినా ఓపిక పట్టామని, ఈ పర్యాయం ప్రజలు ఆదరించి ఓట్లు వేశారని అందుకే నిజాం షుగర్స్‌ను ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలకు హామీ ఇచ్చిందని, రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామన్నారు. ఈనెల 27న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటును ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని, తాము ప్రణాళిక ప్రకారం పనులను చేపడుతూ ముందుకు వెళుతున్నామన్నారు. బోధన్ ఎంఎల్‌ఏ సుదర్శన్‌రెడ్డి నిజాం షుగర్స్‌ను తెరిపించడమే లక్షంగా ఉన్నారని, ఆయన ఆలోచన మీదనే ముందుకు సాగుతున్నామని అన్నారు. నిపుణుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటామని వారితో చర్చిస్తామని లేకపోతే కాళేశ్వరానికి పట్టిన గతే పడుతుందని విమర్శించారు.

కర్మాగారాన్ని ప్రభుత్వం నడపడమో, ప్రైవేటుకు అప్పగించడం, సహకార రంగంలో నడపడమో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫ్యాక్టరీ ఆస్తులు మొత్తం బ్యాంకు గ్యారంటీలో ఉన్నాయని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కర్మాగారం ప్రారంభించాక నష్టాలు రాకుండా చూసేందుకు దిగుబడులు పెంచాలని, నాణ్యమైన విత్తనాలను తీసుకురావాలని, ఈ అంశంపై వ్యవసాయ శాఖ నిపుణులతో చర్చిస్తామన్నారు. రైతుబంధుపై ఆలోచన చేస్తున్నామని, బిఆర్‌ఎస్ పాలనలో గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధును ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి రైతుల గురించి ఏరోజు ఆలోచించలేదని, నిజాం షుగర్స్‌పై బిజెపి ఇప్పటికీ స్పందించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లక్షం, సంకల్పం ఉన్నాయని, అందువల్లే ఫ్యాక్టరీని తెరిపించడమే ప్రధాన లక్షంగా ముందుకు వెళుతున్నామన్నారు. రైతులు అన్ని విధాలా సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఏ సుదర్శన్ రెడ్డి, ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ మన్సూర్, ఎంఎల్‌ఏ భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, మాజీ ఎంఎల్‌ఏలే ఊరవత్రి అనీల్, ఏనుగు రవీందర్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మావతి, శరత్ రెడ్డి, జడ్‌పి వైస్‌ఛైర్మన్ రజిత యాదవ్, కాంగ్రెస్ నాయకులు గంగా శంకర్, హందాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News