బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీలకు ప్రతి నెలా రూ.270 కోట్లు విడుదల చేశామని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పడం ముమ్మాటికీ పచ్చి అబద్ధమని అసెంబ్లీ వ్యవహారాలు, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం ఆయన సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీలకు రూ.270 కోట్లు విడుదల చేసినట్లయితే ఇక పెండింగ్‌లో బిల్లులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చిందని,
2014 ఫిబ్రవరి నెలలో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిందని, ఎవరి హయాంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో అందరికీ తెలుసని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలోనే సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పులను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని వాటిని మెల్లిమెల్లిగా తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. త్వరలోనే సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీల పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు.