Friday, November 22, 2024

జల దోపిడీకి పాల్పడితే ఊరుకోం

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud Comments on AP illegal irrigation projects

అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిపివేయాలి
రాష్ట్రంలో సీమాంధ్రులను కడుపులో పెట్టుకున్నాం
ప్రజలను రెచ్చగొట్టొద్దు
విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాలమూరు : ఎలాంటి అనుమతులు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా, కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి హామీ ఇచ్చి అక్రమంగా ప్రాజెక్టులు కట్టడంపై ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎపి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మహజూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాలమూరుకు నీళ్లు రాకుండా ఉన్న నీటిని తరలించే విధంగా ప్రణాళికలు వేసి నీటిని వాడుకునేందుకు కార్యాచరణ రూపొందించి అక్రమంగా జల దోపిడీకి ఆంధ్ర ప్రభుత్వం పూనుకున్నదని ధ్వజ మెత్తారు. పాలమూరు గోస చూసి ఆవేదనతో మాట్లాడుతుంటే ఆంధ్ర మంత్రులు అనాలోచితంగా అవమానపర్చే విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లా ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటే ఆంధ్ర పాలకులు అన్యాయంగా నీళ్లను మళ్లించేందుకు చర్యలు తీసుకున్నదని దుయ్యబట్టారు. ఆంధ్ర పాలకులు అదనంగా 40 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఎంతో అన్యాయం చేశారని, యాస, భాషను అవమానపర్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంత వాసులపై ఎక్కడ కూడా వివక్ష చూపలేదని, ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ముందుకెళ్తున్నామని పునరుద్ఘాటించారు.రాష్ట్రంలో ఎక్కడైనా ఆంధ్ర ప్రాంతాలకు చెందిన నాయకుల విగ్రహాలు కూల్చేశామా, కాలనీలు పేర్లు మార్చామా, పార్కుల పేర్లు తీసివేశామా సీమాంధ్రులు తెలపాలన్నారు. ఆక్సిజన్ తెలంగాణ ప్రాంతానికి వెళ్లకుండా స్టీల్ ప్లాంట్ ఆపిన ఘనత ఆంధ్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. మన ఉద్యోగులను కూడా ఆంధ్రా ప్రజలు అవమానానికి గురి చేశారని, తిరుపతి దేవస్థానంలో కూడా హేళన చేశారని, బస్ డిపోలలో తెలంగాణకు చెందిన బస్సులను కూడా లోపలికి రాకుండా బయట పెట్టే విధంగా మనపై ఎన్నో వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న సీమాంధ్ర ప్రజలతో తెలంగాణ ప్రజలు మమేకమై జీవనం సాగిస్తే ఆంధ్ర పాలకులు వివక్ష చూపిస్తున్నారన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజలను తెలంగాణ ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటే నిజంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సీమాంధ్ర ప్రజలకు మేలు కోరే వారైతే వెంటనే ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలన్నారు. మీ నీళ్లు మీరు తీసుకెళ్తే ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. న్యాయంగా వాటా ప్రకారం నీటిని తీసుకెళ్తే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. 44 వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నారని ఇంకా న్యాయంగా మీ వాటా ఉంటే తీసుకెళ్లాలని కానీ ప్రజలను రెచ్చగొట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కృష్ణానది మేనేజ్‌మెంట్ బోర్డు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. నిబంధనలకు విధంగా విద్యుత్ ప్రాజెక్టును ఆపాలనడం సిగ్గుచేటన్నారు. ఎందుకు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలో దేశ ప్రజలకు ఆంధ్ర పాలకులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి సీఎం జగన్‌ను పిలిచింది ఇరు రాష్ట్రాల సంబంధాలు సత్సంబంధాలు కొనసాగడానికి వివరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 సంవత్సరాలు తెలంగాణకు ఎంతో అన్యాయం చేసినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఇచ్చిన మాటా ప్రకారం వ్యవహరించాలని ఆంధ్ర పాలకులకు హితువు పలికారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ ఊరుకోడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంప్రదించి చర్చిస్తే ఎటువంటి సమస్యలు తలెత్తవని కానీ ఒంటెద్దుపోకడలకు పోతే మాత్రం ఊరుకునేది లేదని ఆంధ్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News