హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా సిఎం కప్ – 2023 క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సిఎం కప్ 2023పై ఆయన మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కప్ – 2023 క్రీడా పోటీలు విజయవంతం చేయాలని, ఇప్పటికే మండల స్థాయిలో ఇప్పటికే ఘనంగా ప్రారంభమైనట్లు తెలిపారు.
మండల స్థాయిలో జరుగుతున్న క్రీడాత్సవాలలో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని సిఎం కప్ – 2023 పోటీలను విజయవంతం చేయాలని మంత్రి స్థానిక ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈనెల 22న జిల్లాస్థాయిలో జరుగుతున్న సిఎం కప్ క్రీడల పోటీలలో జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకొని సిఎం కప్ – 2023 క్రీడోత్సవాలలో పాల్గోని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, SATS డిప్యూటీ డైరక్టర్ దీపక్ పాల్గొన్నారు.