హైదరాబాద్: నాలుగు దశాబ్ధాల అనంతరం హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. సంబురాల్లో పాల్గొన్న హాకీ జట్టకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి భారత్ హాకీ జట్టు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిందన్నారు జట్టు సభ్యులు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిందని క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సిఎం కెసిఆర్ నేతృత్వంలో పెద్ద పీట వేస్తున్నారన్నారు. క్రీడా పాలసీని రూపొందించడానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని క్రీడాహబ్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని కొవిడ్ యోధులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి అంకితం ఇచ్చిన హాకీ జట్టుకెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహమ్ రీడ్లకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేకును కట్ చేసి, బాణాసంచా కాల్చి తన సంతోషాన్ని హాకీ క్రీడాకారులతో కలిసి షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు సరల్ తల్వార్, చైర్మన్ కొండ విజయ్, ఉపాధ్యక్షుడు రఘునందన్ రెడ్డి, కోశాధికారి భాస్కర్ రెడ్డి, కల్యాణి సింగ్, విద్యాసాగర్, పాండు రంగారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, హాకీ జట్టు క్రీడాకారులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.