మనతెలంగాణ/ హైదరాబాద్ : 4వ ఇండియన్ ఓపెన్ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2022లో రాష్ట్రానికి చెందిన కె.లోకేశ్వరి మహిళల ఎస్ 37 విభాగంలో షాట్ ఫుట్‌లో సిల్వర్, డిస్కస్ త్రో లో బ్రాంజ్ మెడల్ సాధించినందుకు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమెను అభినందించారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిలతో కలిసి ఆమెను ప్రశంసించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని రెండోస్థానంలో నిలిపారన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకా రులను ప్రోత్సహిస్తున్నామని ఆయనన పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన సూచించారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ వేణు, పారా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.