Wednesday, January 22, 2025

మహబూబ్ నగర్ దశ దిశ మారుస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లాను అన్నీ రంగాలలో అభివృద్ధి చేసి జిల్లా దశ దిశను మారుస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టణంలోని 387 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్దిదారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… గతంలో ఎవరు పట్టణాభివృద్ధికి కూడా ఈ స్థాయిలో నిధులు వెచ్చించి ఉండరని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా రూ. 62.80 కోట్లను ఇచ్చినట్లు తెలిపారు. ఆసరా పెన్షన్ల కింద రూ. 407 కోట్లు పంపిణీ చేశామని, వీటితోపాటు, సబ్సిడీ రుణాలు, పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

గతంలో మహబూబ్ నగర్ లో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, టాంకర్ల దగ్గర ప్రజలు మంచినీటి కోసం ప్రతిరోజు పోరాటం చేసే వారని, అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత తాగునీటి సమస్య లేకుండా చేసి ప్రతిరోజు తాగునీరు ఇస్తున్నామని అన్నారు. దివిటిపల్లి వద్ద 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా అమరరాజా బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యువతకు ఇక్కడే ఉపాధి కల్పించి వారు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో వైద్యం అందక ఏ ఒక్కరు మరణించరాదని, అనారోగ్యంతో బాధపడే వారికి, పేద ప్రజలందరికీ వారి ఆరోగ్యం కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసిలు, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. పాత కలెక్టరేట్ స్థానంలో వందల కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. ఈనెల 22వ తేదీన పనులకు భూమి పూజ చేపట్టి వచ్చే సంవత్సరం నాటికి భవన నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్లుగా పక్క రాష్ట్రాలలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు, రైతుబంధు వంటి పథకాలు ఏవి లేవని అన్నారు. ప్రతి ఒక్కరికి తాగునీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం ,ఉపాధి, పెన్షన్లు, ఆసుపత్రి సౌకర్యాలు కావాలని, వాటన్నిటిని కల్పించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని అన్నారు.

8 సంవత్సరాలకు పూర్వం మహబూబ్ నగర్ జిల్లా ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలని మంత్రి కోరారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కారణంగా భూములు, భవనాలు, స్థలాల ధరలు భారీగా పెరిగాయన్నారు.మహబూబ్ నగర్ ను మరింత అభివృద్ధి చేసి అందరికీ ఇక్కడే ఉపాధి కల్పించి పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ దశాదిశ మారుస్తామన్నారు. పేద ప్రజల సంక్షేమ పథకాల అమలుకు ఎవరైనా అడ్డుపడిన, ఆటంకాలు కల్పించిన ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజేష్, మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్ పార్థసారథి, కౌన్సిలర్లు ఉన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News