Wednesday, December 25, 2024

ఖిలాషాపూర్ కోటను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud inspecting Khilashapur fort

జనగామ: జిల్లాలోని తెలంగాణ పురావస్తు శాఖ చరిత్రాత్మక కట్టడం, బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్వయంగా నిర్మించి, రాజధానిగా చేసుకొని పాలించిన ఖిలషాపూర్ కోట పునరుద్ధరణ పనులను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రాజయ్యతో కలసి బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్ని కులాలను, మతాలను సమానంగా ఆదరించిన గొప్ప పాలకుడు అని అభివర్ణించారు. పాపన్న చరిత్ర ను మన దేశంలో కనుమరుగు చేశారన్నారు. పాపన్న చరిత్ర తెలుసుకున్న బ్రిటిష్ కు చెందిన చరిత్రకారులు చరిత్రను, వారి చిత్రపటాన్ని లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో భద్రపరిచారన్నారు. అక్కడి చరిత్రను శ్రీ పేర్వారం రాములు సోదరుడు జగన్నాధం పరిశోధన చేసి వారి ఫోటోలను ఇక్కడ ప్రతిష్ట చేశారన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొద్దిమంది సైన్యంతో 33 కోటలను జయించి ఆ కోటలకు 33 బహుజన కులాలకు బాధ్యతలు అప్పగించారన్నారు. అలాంటి చారిత్రక పురుషుడు పాలించిన కోటలను సిఎం కెసిఆర్  ఆదేశాల మేరకు సంరక్షణకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా వల్ల పాపన్న నిర్మించిన 400 వందల ఎకరాల కోటలను సంరక్షణ చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత వర్షకాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల కోట కొంత భాగం కూలిపోయిన సమాచారం అందుకున్న మంత్రి వెంటనే కోటను సందర్శించారు. కోట పునరుద్ధరణ పనులకు 1 కోటి 26 లక్షల రూపాయలను కేటాయించారన్నారు. పునరుద్ధరణ పనులను పరిశీలించటానికి ఆకస్మికంగా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే డా. రాజయ్య, జిల్లా కలెక్టర్ శివలింగయ్య గార్లతో కలసి పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

అంతేకాకుండా తాటికొండ కోట, ఖిలషాపూర్ కోటలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని సీఎం ఆదేశాల మేరకు అధికారికంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఖిలషాపూర్ లో కూడా అదే రోజు అధికారికంగా నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే  రాజయ్య  ఆహ్వానాన్ని స్వాగతించారు. ఎంఎల్ఎ విజ్ఞప్తి మేరకు తాటికొండ కోట అభివృద్ధిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కోటకు అనుబంధంగా ఉండి గత వర్షాల వల్ల దెబ్బతిన్న ఇండ్ల బాధితులకు నష్టపరిహారంగా వెంటనే వారికి ఇండ్ల స్థలాలను కేటాయించి వారికి డబల్ బెడ్ రూమ్ లను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా ఖిలషాపూర్ గ్రామంలోని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, డా. బాబాసాహెబ్ అంబెడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ విగ్రహాల వద్ద ఉన్న చెత్త, మట్టికుప్పలను స్థానిక ఎమ్మెల్యేతో కలసి తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శ్రీనివాస్ గౌడ్ గారు గ్రామస్తులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News