Sunday, December 22, 2024

శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధనతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బుద్ధిజంకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం భేటీ అయ్యారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ మేరకు మంత్రి వారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం అభివృద్ధికి చేస్తున్న కృషిని ఆయనకు తెలియజేశారు. సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం పూర్వ వైభవానికి చేస్తున్న కృషితో పాటు టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, ఇండస్ట్రియల్ పాలసీ, వ్యవసాయ విధానాలను శ్రీలంక ప్రధానికి వివరించారు.

బుద్ధిజం పూర్వ వైభవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషినీ తెలుసుకుని ఈ సందర్భంగా శ్రీలంక ప్రధాని కొనియాడుతూ తెలంగాణ ప్రాంతంలో బుద్ధిజంకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు . అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ బుద్ధిజం పూర్వ వైభవానికి చేస్తున్న కృషిని తెలియజేశారు. తెలంగాణ ప్రాంతంలో బుద్ధుడు జీవించి ఉన్న కాలం నాటి నుండి బుద్ధిజం వ్యాప్తి చెందిందని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బౌద్ధ ఆధ్యాత్మిక, విజ్ఞాన కేంద్రాలైన కోటిలింగాల, బాదం కుర్తి, ఫనిగిరి, నాగార్జున కొండ, నేలకొండపల్లి లాంటి పురాతన బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించడంతోపాటు, పర్యాటకంగా, చారిత్రకంగా, పరిశోధన లపట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరించి బుద్ధిజం కు పూర్వవైభవానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆచార్య నాగార్జునుడు నడియాడిన చారిత్రక విజయపురి (నాగార్జునసాగర్ )లో సుమారు 200 ఎకరాలలో 100 కోట్ల రూపాయలతో బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించామన్నారు. బౌద్ధ ఆధ్యాత్మిక పర్యాటకుల సౌలభ్యం కోసం శ్రీలంక నుండి హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రోజువారీగా విమానాలను నడపాలని శ్రీలంక ప్రధానమంత్రికి ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

శ్రీలంక – తెలంగాణ రాష్ట్రాల మధ్య బౌద్ధ ఆధ్యాత్మిక, సంస్కృతిక , బౌద్ధ ఆధ్యాత్మిక సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఈ సందర్భంగామంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన విజ్ఞప్తికి శ్రీలంక ప్రధాని సానుకూలంగా స్పందించారు. అనంతరం హైదరాబాదు చరిత్రపై సింహాళ భాషలో శ్రీలంక ప్రధాని దినేష్ గుణ వర్ధనే కోడలు రూపొందించిన పుస్తకాన్ని త్వరలో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా శ్రీలంక ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ భేటీలో శ్రీలంక వెస్ట్రన్ ప్రావిన్స్ ఎంపి యాదమిని గుణవర్ధన, శ్రీలంక దేశ ప్రభుత్వ కార్యదర్శి సుగేశ్వర్, పార్లమెంటు వ్యవహారాల సెక్రటరీ కురుప్పు, లైట్ ఆఫ్ ఏషియా వ్యవస్థాపకులు నవీన్ గుణవర్ధినే, హాలీవుడ్‌లో నిర్మిస్తున్న బుద్ధుని బయోపిక్‌లో బుద్ధుని పాత్రధారి గగన్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News