చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ పోరాటం
తెలంగాణాలో మొదటి వీర వనిత చాకలి ఐలమ్మ
హైదరాబాద్ లో ఐలమ్మ భవన్ కు 2 ఎకరాల స్థలం, రూ. 5 కోట్ల నిధులు
పేద వర్గాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం: ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావితరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు, తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్దంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తా సమీపంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావి తరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు ఎప్పటికీ ఈ గడ్డకు స్ఫూర్తి ప్రదాత అని మంత్రి తెలిపారు. తెలంగాణాలో మొదటి వీర వనిత చాకలి ఐలమ్మ అని, భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన యోధురాలని పేర్కొన్నారు.
తన పోరాటంలో భర్తను, కొడుకును కోల్పోయినా చివరి వరకు పోరాటం చేసిన ధీర వనితన్నారు. నిరంకుశ నాయకులపై పోరాటం చేసి తరిమికొట్టిన ధీశాలి అని మంత్రి పేర్కొన్నారు. అంతటి మహనీయురాలి వర్ధంతి, జయంతి సందర్భంగా స్మరించుకోవడమే గొప్ప విషయమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ ఆ పోరాటం కొనసాగిందన్నారు. మహబూబ్ నగర్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీసీలను ఇన్నాళ్లు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని… తెలంగాణ ఏర్పడిన తర్వాతే బీసీలకు తగిన ప్రాధాన్యం లభిస్తోందన్నారు. చాకలి ఐలమ్మ ఆత్మ గౌరవ భవనానికి 2 ఎకరాల భూమి 5 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కౌన్సిలర్లు, రజక సంఘాల నేతలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.