Wednesday, January 22, 2025

పాలమూరు గోసను చూసిన ఉద్యమనేత కెసిఆర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పాలమూరు రంగారెడ్ది ఎత్తిపోతల పథకం పరిధిలోని కరివెన రిజర్వాయర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి పాలాభిషేకం, జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ… పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఎడారిగా మారిన తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్ పడిన తపన ఎంతో గొప్పదన్నారు. ఆర్డీఎస్ షటర్లు బద్దలు కొట్టి మన తాగునీటిని ఆంధ్రకు తరలించుకుపోయినా ఆనాటి ముఖ్యమంత్రులు ఏనాడూ స్పందించలేదు… పాలమూరు గోసను చూసిన ఉద్యమనేత కేసిఆర్ జోగులాంబ నుంచి పాదయాత్ర చేశారని మంత్రి వెల్లడించారు.

ప్రాజెక్ట్ అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయి. కేంద్రం అనేక కొర్రీలు వేసింది. మన ప్రాంతం నాయకులే కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రంలోని బిజెపి మోసం చేసిందన్నారు. ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా తమ పరిశీలనలో లేదని చెప్పిన కేంద్రం కర్ణాటకలోని అప్పర్ భద్రకు మాత్రం జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ ప్రజలను దగా చేసిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీటిని అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నారు.

పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. రెండు మూడు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తాం. ఎవరైనా మళ్లీ ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే కాలువల్లో వేసి తొక్కేస్తాం… వెంటాడి తరిమి కొడతాం. పాలమూరు ప్రజల బతుకుదురువే సాగునీరు ఆ సాగునీరు రాకుండా అడ్డుకుంటే ఊరుకుంటామా… పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేసిందన్నారు.

పర్యావరణ అనుమతులతో దశాబ్దాలుగా వివక్షకు గురైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ నీటిని మళ్లించి సస్యశ్యామలం చేస్తామన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటి నిల్వ సామర్థ్యం లేకుండా రిజర్వాయర్లు నిర్మించకుండా అన్యాయం చేసిన ఘనత గత పాలకులది. పాలమూరు ప్రాజెక్టును కల్వకుర్తి ప్రాజెక్టుతో అనుసంధానిస్తాం… భవిష్యత్తులో కాలేశ్వరం జలాలను కూడా పాలమూరుకు తరలిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన సూచించారు.

గత పాలకులు పాలమూరు నీటి కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆయన ఎంతో కష్టపడి సాధించుకున్న పాలమూరు ప్రాజెక్టుని ఆపాలని ఎవరైనా కుట్ర చేస్తే ఈ ప్రాంతం వాడైతే ఇక్కడే పాత్ర వేస్తాం.. పరాయి వాడయితే తరిమి తరిమి కొడతామన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు యావత్ ఉమ్మడి జిల్లా తరఫున పాదాభివందనం చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, బూత్పూర్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బసవరాజ్ గౌడ్, జడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News