మహబూబ్నగర్: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం అయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానం నుండి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అతిపెద్ద ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ర్యాలీకి హాజరైన వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి ఎంతో మంది దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను అర్పించి తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు పోవాలని, మానవత్వంతో ప్రతి ఒక్కరు ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధిలో ముందుకు పోవాలని, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలని, అసమానత్వం పోవాలని, అభివృద్ధిలో యువత ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశం అన్ని రంగాలలో అగ్రభాగాన ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తన స్వార్థం కోసం కాకుండా ఇతరుల బాగు కోసం కృషి చేయాలని, ప్రతి ఒక్కరికి విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం అందిన నాడే మనం నిజమైన అభివృద్ధిని సాధించిన వారమవుతామని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ ,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
స్వతంత్ర వజ్రోత్సవ ర్యాలీకి భారీగా జనం…
స్వతంత్ర వజ్రోత్సవ ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. సుమారు పదివేల మంది యువత, విద్యార్థులు, ఎన్ సి సి, స్కౌట్స్, గైడ్స్, మహిళలు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు ప్రతి ఒక్కరు జెండాలు, త్రివర్ణ పతాక బెలూన్లు, ప్లే కార్డులు చేత పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.