మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళి
హైదరాబాద్ : తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహిత పైడి జైరాజ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. పైడి జైరాజ్ 113వ జయంతి సందర్భంగా మంత్రి జైరాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలీవుడ్‌లో అగ్రహీరోగా రాణిస్తూ, దర్శకునిగా, నిర్మాతగా, బహుభాషా నటుడిగా గుర్తింపు పొంది జాతీయ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలితరం తెలంగాణ ముద్దు బిడ్డ పైడి జైరాజ్ అని ఆయనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రానికి చెందిన వైతాళికులను, కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, సామాజికవేత్తలను గుర్తించి వారిని గౌరవిస్తున్నామన్నారు.
పైడి జైరాజ్ సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కళావేదిక రవీంధ్రభారతిలో ఉన్న ప్రివ్యూ థియేటర్‌కి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌గా పేరు పెట్టి గౌరవిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యాస, భాషా, సంస్కృతులను, కళాకారులను నిర్లక్షం చేశారని తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సాంప్రదయాలకు, కళాకారులకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌జిఒ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, టిజిఒ ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, టిఎన్‌జిఒ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టిజిఒ కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, భాగ్యనగర్ టిఎన్‌జిఒ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.