ప్లీనరీ విజయవంతంతో తమ పునాదులు కదిలిపోతాయని భయపడుతున్నాయి
మరో 20ఏళ్ల పాటు అధికారంలో టిఆర్ఎస్ కొనసాగుతుంది భయంతోనే ప్రతిపక్షాల విమర్శలు దళితబంధును చూసి ఓర్వలేక ఒక్కొక్కరు ఒక్కొక్కతీరుగా మాట్లాడుతున్నారు : టిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో మీడియాతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ విజయవంతం కావడంతో ప్రతిపక్షాలకు కడుపుమంటగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్లీనరీ నిర్వహణతో టిఆర్ఎస్ మరో 20 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందనే భరోసా కలిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ లాంటి నాయకుడు తమకు కావాలని ఎపి సహా పలు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సమర్థుడు కనుకనే సదస్సులో ప్రసంగించాలని ఫ్రాన్స్ దేశం ఆహ్వానించిందని .. ఇందులో పైరవీలు ఉంటాయా..? అని మంత్రి ప్రశ్నించారు. టిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బిసి గణన జరిగితే వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయనే కాంగ్రెస్, బిజెపిలకు సిఎం కెసిఆర్ అంటే భయమని విమర్శించారు. కెసిఆర్ అంటే ప్రతిపక్షాలకు ఎందుకు కోపం అంటే బిసి జనగణనకు తీర్మానం చేశారు కాబట్టే అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎంతమంది బిసిలు ఉన్నారని తెలిస్తే అది ఏమవుతుందో అని భయమని అన్నారు. బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామని, అది అమలయితే ఎట్ల అయితదో అని భయమని చెప్పారు. దళితబంధు తీసుకొచ్చారు… దళితబంధుతో ఆర్థికంగా అభివృద్ధి అవుతారనే భయమని అన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం అయింది..అది అమలయితే ఎలా అని భయం…ఎస్సి వర్గీకరణపై తీర్మానం చేశారు… ఎట్లా అని భయం… మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని తీర్మానం చేశారు ఎట్లా అని ప్రతిపక్షాలకు భయమని విమర్శించారు. దళితబంధును చూసి ఓర్వలేకే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు టిఆర్ఎస్ పాలనలో మేలు జరుగుతోందన్నారు.
తమ పునాదులు కదిలిపోతాయనే భయంతోనే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కొందరు బహిరంగ చర్చ అంటున్నారని.. ఎన్నికలుండగా ఇంకా చర్చలెందుకని అన్నారు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి కొలమానమని, ఇంకా వేరే కొలమానం ఎందుకని ప్రశ్నించారు.అన్ని ఎన్నికల్లో విజయం సాధించాం…అదే తమ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితమే ఎవరేంటనేది తెలుస్తుందని అన్నారు. హజూరాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలపై త్వరలోనే ప్రక్రియ మొదలవుతుందని మంత్రి తెలిపారు. ఏడేళ్లలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందా..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా అని అడిగారు. ఏడేళ్ల పసికూన తెలంగాణ…దేశం గర్వపడేలా అభివృద్ధి సాధిస్తోందని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ తల్లిని గుర్తించని వారికి తెలంగాణ తల్లితో ఏం పని అని ప్రశ్నించారు. చైనాలో కూడా సాధ్యం కాని రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంతో పూర్తి చేసిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని అన్నారు. పేదలకు అన్నం పెట్టే పార్టీ టిఆర్ఎస్ కనుకనే కాంగ్రెస్, బిజెపి నేతలకు కంటగింపు అని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే మళ్లీ అక్కడ వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ముందు ఆ పార్టీ నేతలు ఆ పని చేయాలని హితవు పలికారు.